థానేలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ కూలి 15 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు
థానేలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గిర్డర్ లాంచర్ యంత్రం కూలి 15 మంది చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ యంత్రం థానేలో కూలడంతో 15 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులతో పాటు పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గర్డర్ యంత్రాన్ని కలిపే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని, మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైవే, హైస్పీడ్ రైల్ బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రీకాస్ట్ బాక్స్ గిర్డర్లను ఏర్పాటు చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ అని పిలిచే ఈ సమృద్ధి మహామార్గ్ 701 కిలో మీటర్లు ఉంటుంది. ఇది ముంబై- నాగపూర్ లను కలుపుతుంది.