Electricity Amendment Bill 2022: విద్యుత్ సవరణ బిల్లు 2022 ఆమోదానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ (సవరణ) బిల్లు 2022 విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. 

Samyukta Kisan Morcha: ప్రస్తుతం కొన‌సాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ (సవరణ) బిల్లు 2022 (Electricity Amendment Bill 2022) ను ప్రవేశపెట్టి ఆమోదించాల‌నే ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో దేశంలోని రైతు సంఘాలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి హెచ్చ‌రించాయి. ఈ బిల్లు విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా గురువారం నాడు కేంద్ర ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి హెచ్చరించింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉందని, ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని తమ దృష్టికి వచ్చిందని రైతు సంఘం పేర్కొంది.

"ఈ బిల్లును ఉపసంహరించుకోవడం సంవత్సర కాలంగా సాగుతున్న రైతుల పోరాటం ప్రధాన డిమాండ్లలో ఒకటి. డిసెంబర్ 9, 2021 న కేంద్ర ప్రభుత్వం SKMకి ఒక లేఖ ఇచ్చింది. ఆ లేఖ‌లో ఈ క్రింది విధంగా పేర్కొంది.. విద్యుత్ బిల్లులోని నిబంధనలపై రైతులను ప్రభావితం చేస్తుంది. ముందుగా అన్ని వాటాదారులు/సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చ ఉంటుంది. రైతు సంఘంతో చర్చ తర్వాత మాత్రమే బిల్లును పార్లమెంటు ముందు ఉంచుతారు" అని SKM ఒక ప్రకటనలో తెలిపింది. గత ఎనిమిది నెలల్లో ఇలాంటి చర్చ ఎప్పుడూ జరగలేదని SKM తెలిపింది. కాబట్టి ఇది కేంద్రప్రభుత్వం రాత‌పూర్వకంగా ఇచ్చిన హామీలకు పూర్తిగా తుంగ‌లో తొక్కుతూ.. రైతుల‌కు ద్రోహం చేయడమే అని పేర్కొంది. "విద్యుత్ (సవరణ) బిల్లు 2022 విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డం దీని ల‌క్ష్యంగా ఉంది" అని సంయుక్త కిసాన్ మోర్చ ఆరోపించింది. 

బిల్లు ఆమోదం పొందిన తర్వాత రైతులకు, దేశంలోని అన్ని ఇతర వర్గాల ప్రజలకు విద్యుత్ రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి అపారమైన లాభాలను ఇస్తుందని SKM ఒక ప్రకటనలో పేర్కొంది. "క్రాస్ సబ్సిడీ రద్దు చేయబడుతుంది. రైతులకు ఉచిత లేదా చౌకగా విద్యుత్తు అంద‌డం నిరాక‌రించ‌బ‌డుతుంది. రైతులకు ఉత్పత్తి వ్యయం మరింత పెరుగుతుంది. గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో దేశీయ విద్యుత్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. విద్యుత్ ఉద్యోగులు - ఇంజనీర్ల ఉద్యోగాలు ప్రతికూలంగా ప్ర‌భావితం అవుతాయి" అని పేర్కొంది. విద్యుత్ (సవరణ) బిల్లు 2022 ప్రవేశపెట్టబడి/పాస్ చేయబడితే, తక్షణమే దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు SKM పిలుపునిచ్చింది. ప్ర‌భుత్వం ఈ బిల్లును తీసుకువ‌చ్చి.. ఆమోదం ల‌భిస్తే మ‌రోసారి దేశంలోని రైతాంగం పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సంయుక్త కిసాన్ మోర్చ హెచ్చ‌రించింది.

"దేశవ్యాప్త నిర‌స‌న ప్రదర్శనల కోసం విద్యుత్ ఉద్యోగులు-ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ దేశవ్యాప్త కార్యాచరణ పిలుపుకు SKM పూర్తిగా మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదించినట్లయితే మ‌రోసారి దేశ‌వ్యాప్త ఉద్య‌మం ఉద్య‌మం చేస్తాం" అని హెచ్చ‌రించింది. గత పార్లమెంట్ సెషన్ లోనే ప్రభుత్వం Electricity Amendment Bill 2022 ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. అయితే, దీనిపై రైతు సంఘాలు వ్యతిరేకించాయి.