తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీపీసీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి లోక్ సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 

2015 నుంచి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గుముఖం పట్టాయని కేంద్రం ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో ప్ర‌క‌టించింది. తెలంగాణ ఎంపీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

తెలంగాణలో 2014 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు, ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలు, ఆత్మహత్యలను అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు, చేపట్టిన పథకాలు, లబ్ధిపొందిన రైతుల సంఖ్య వివ‌రాలు కావాల‌ని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏమైనా న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చిందా ? అని అడిగారు. 

ఆయ‌న ప్ర‌శ్న‌క‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తోమ‌ర్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాలను ఆధారంగా జ‌వాబు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 2015లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల సంఖ్య 1,358కి పెరిగిందని తెలిపారు. 2016లో 632 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, 2017లో 846 మంది రైతులు, 2018లో 900 మంది రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని చెప్పారు. అయితే 2019లో ఆత్మ‌హ‌త్యలు త‌గ్గిపోయాయ‌ని చెప్పారు. ఆ ఏడాది 491గా నమోదు అయ్యాయ‌ని అన్నారు. అలాగే 2020 సంవ‌త్స‌రంలో 466కి తగ్గాయని పేర్కొన్నారు. 

ఎన్‌సీఆర్‌బీ ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ (ఏడీఎస్‌ఐ) పేరుతో తన ప్రచురణలో ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, ప్రచారం చేస్తుందని తోమర్ చెప్పారు. NCRB తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 2020 వరకు నివేదికలను ప్రచురించింది. అయితే ఎన్‌సీఆర్‌బీ జిల్లా వారీగా రైతుల ఆత్మహత్యల వివరాలను ప్రచురించదు. 

రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను 2014, 2015 సంవత్సరాలకు సంబంధించిన ఏడీఎస్‌ఐ తన నివేదికలో పేర్కొందని తోమర్ తెలిపారు. ఆ రెండు సంవ‌త్స‌రాల్లో రైతుల ఆత్మహత్యలకు దివాలా లేదా అప్పుల బాధ, వ్యవసాయ సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలే ప్రధాన కారణమని ఆ నివేదిక‌లు చెప్పాయ‌ని అన్నారు. 

‘‘ వ్యవసాయం రాష్ట్ర పరిధిలో అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం కూడా విధానపరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు, వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్రాల ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది ’’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.