చేసిన పనికి కూలీ ఇవ్వడం లేదని ఓ రైతును మరో రైతు దారుణంగా హత్య చేశాడు. విల్లుపురం తిరుక్కోవిలూర్ సమీపంలోని ఎడైయూర్ గ్రామానికి చెందిన ఆర్ముగానికి పొలం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం స్థానికంగా ఉన్న మేఘవర్ణన్ చేత ట్రాక్టర్‌తో పొలం దున్నించాడు...

అందుకు సంబంధించిన రూ.300 కూలీ ఇవ్వాలి. ఆ నగదు ఇవ్వాలని తరచుగా మేఘవర్ణన్.. ఆర్ముగం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. బుధవారం సాయంత్రం మేఘవర్ణన్ తన అల్లుడు రామదాసుతో కలిసి ఆర్ముగం ఇంటికి వెళ్లి రావాల్సిన నగదు ఇవ్వాలని మరోసారి అడిగాడు.

అప్పుడు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన మేఘవర్ణన్, రామదాసు అక్కడే ఉన్న ఐరన్ రాడ్డుతో ఆర్ముగంపై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.