ప్రముఖ కన్నడ నటుడు మన్ దీప్ రాయ్ కన్నుమూత..
కన్నడ చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. 500 పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ కన్నడ నటుడు మన్ దీప్ రాయ్ చనిపోయారు. 1981లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 72 సంవత్సరాల వయస్సులో మరణించారు.
ప్రముఖ కన్నడ నటుడు మన్ దీప్ రాయ్ ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబర్ లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున ఆయన పరిస్థితి విషమించడంతో తన 72వ యేట మరణించారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది.
మన్ దీప్ రాయ్ అంత్యక్రియలు ఆదివారం హెబ్బాళ్ శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన కుమార్తె అక్షత అన్నారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచామని పేర్కొన్నారు. తన తండ్రికి నెల రోజుల క్రితం గుండెపోటు రావడంతో బెంగళూరులోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించామని ఆమె ‘న్యూస్ 18’తో తెలిపారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో చికిత్స పొందారని పేర్కొన్నారు.
మన్ దీప్ రాయ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సినీ విమర్శకుడు ఎస్.శ్యామ్ ప్రసాద్ ట్విటర్ లో ‘మన్ దీప్ రాయ్ నిజజీవితంలో కూడా మంచి వ్యక్తి. కొన్నేళ్ల క్రితం నేను నివసించిన ఆర్పీసీ లేఅవుట్లో తరచూ అతడితో గొడవ పడే వాడిని. ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఆయన మాల్గుడి డేస్, పుష్పక విమానం తదితర చిత్రాల్లో తాను పోషించిన పాత్రల మరపురాని జ్ఞాపకాలను మిగిల్చారు. వీడ్కోలు.’’ అంటూ పోస్ట్ చేశారు.
1981లో వచ్చిన 'మిన్చినా ఊటా' చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మన్ దీప్ రాయ్ 500కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రధానంగా హాస్య పాత్రలలో కనిపించిన ఈ నటుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చాలా మందికి అభిమాన నటుడిగా మారిపోయారు. బెంకియా బల్లె, ఆకాశమిక, ఏలు సుతికా కోటే, గీత, యాక్సిడెంట్, ఆసెగోబ్బ మీసెగొబ్బ, ఖుషి, అమృతధారే, కురిగాలు సార్ కురుగాలు ఈయన నటించిన ప్రముఖ సినిమాలు. 2021లో వచ్చిన ఆటో రామన్న సినిమాలో చివరిసారిగా మన్ దీప్ రాయ్ కనిపించారు.