విషాదం : పాము కోసం పొగబెడితే, ఇల్లు మొత్తం కాలిపోయింది..
ఇంట్లోకి దూరిన పామును వెళ్లగొట్టడానికి ఓ కుటుంబం చేసిన ప్రయత్నం వారిని సర్వం కోల్పోయి రోడ్డున పడేలా చేసింది. ఈ విషాద ఘటన ఉత్తప్రదేశ్ లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన గుండెల్ని మెలిపెట్టేలా ఉంది. ఇంట్లోకి దూరిన పామును తరిమికొట్టాలని పొగబెడితే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ మంటల్లో నగదు, నగలు, క్వింటాళ్ల కొద్దీ ధాన్యం కాలి బూడిదై పోయింది. యేళ్ల తరబడి కష్టంతో పోగేసుకున్నదంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. కుటుంబ జీవితకాల పొదుపు, ఆస్తులు కలిపి మొత్తంగా లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చడం ద్వారా వచ్చే పొగతో ఇంట్లోకి దూరిన పామును వెళ్లగొట్టాలని ప్రయత్నించిందో కుటుంబం. ఆ పొగ కాస్త ఇంట్లో మంటలు చెలరేగడానికి దారితీసింది. దీంతో నిమిషాల వ్యవధిలో వారి ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
యువకుడి కడుపులో కత్తి.. ఐదేళ్లుగా నరకం.. ఇంతకీ ఎలా వచ్చిందంటే..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు తమ ఇంట్లో నాగుపాము ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీనికోసం ఆవుపిడకలతో పొగ వేయాలనుకుని.. పిడకలను కాల్చారు. దీని కారణంగా అనూహ్యంగా ఇంట్లో మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో గది మొత్తం దగ్ధమైంది. కుటుంబంలోని నగదు, నగలు, క్వింటాళ్ల కొద్దీ ధాన్యం మంటల్లో కాలి బూడిదై పోయింది. ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కుటుంబ జీవితకాల పొదుపు, ఆస్తులు కలిపి లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెవెన్యూ శాఖకు కూడా సమాచారం అందించి ప్రస్తుతం జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నారు. పామును వెళ్లగొట్టడానికి ప్రయత్నించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.