ఉత్తరప్రదేశ్‌లో నకిలీ ప్లేట్‌లెట్ల ముఠా కలకలం రేపుతున్నది. ప్లేట్‌లెట్లకు బదులు ప్లాస్మాను అమ్ముతున్న ఓ గ్యాంగ్‌ను యూపీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ ప్లేట్‌లెట్ల పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ప్లాస్మాకు బదులు మొసంబీ జ్యూస్ ఎక్కించిన కారణంగా ఓ పేషెంట్ మరణించిన రోజుల వ్యవధిలో అదే రాష్ట్రంలో తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
లక్నో: నకిలీ బెడద రానురాను మరింత వికృతంగా తయారవుతున్నది. రక్తం కూడా నకిలీ వస్తువుగా మార్చే హేయమైన చర్య ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. అమాయక పేషెంట్లను బురిడీ కొట్టిస్తూ నకిలీ రక్తకణాలను అమ్ముతున్న ఒక ముఠా గుట్టును యూపీ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే ఓ డెంగ్యు పేషెంట్‌కు ప్లాస్మాకు బదులు మొసంబీ జ్యూస్ ఎక్కించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మూడు యూనిట్లు ఎక్కించిన తర్వాత రియాక్షన్‌కు గురై ఆ పేషెంట్ మరణించాడు. ఈ ఘటన చోటుచేసుకున్న రోజుల వ్యవధిలోనే తాజాగా, నకిలీ రక్త కణాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు శుక్రవాం ఈ ముఠాకు చెందిన పది మందిని అరెస్టు చేశారు.
కొందరు ఇచ్చిన సమాచారం మేరకు తాము ముఠా సభ్యులను పట్టుకున్నామని యూపీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ రక్త కణాల ప్యాకెట్లను రికవరీ చేసుకున్నట్టు వివరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పేషెంట్లకు నకిలీ రక్త కణాల పౌచ్‌లను అమ్ముతున్న పది మంది గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసినట్టు ఎస్ఎస్‌పీ శైలేష్ కుమార్ పాండే చెప్పారు. నిందితులు బ్లడ్ బ్యాంకుల నుంచి ప్లాస్మాను సేకరిస్తున్నారని, వారు వాటిని ప్రత్యేక పౌచ్‌లలో పెట్టి ప్లేట్‌లెట్స్‌గా వాటిని పేషెంట్లకు అమ్ముతున్నారని తెలిపారు. వారు ప్లాస్మాను ప్లేట్‌లెట్లుగా అమ్ముతున్నారని చెప్పారు. ఓ శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించామని, ఆ తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుందని వివరించారు.
రక్తాన్ని అక్రమంగా అమ్ముతున్న సుమారు 12 మందిని ఇటీవలే అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు.
ఇటీవల ప్లాస్మాకు బదులు మొసంబీ జ్యూస్ ఎక్కించడంతో ఓ పేషెంట్ మరణం గురించి కూడా ఆయన స్పందించారు. ఆ ప్రైవేటు హాస్పిటల్‌ను సీల్ చేసినట్టు వివరించారు. ఆ పౌచ్‌లో ఉన్నది ఫ్రూట్ జ్యూసా? లేక మరేదైనా? అనే విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదని తెలిపారు.
