దేశంలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా వైరస్ కారణంగా.. దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే అని ఇటీవల రతన్ టాటా చెప్పినట్లు గత కొద్ది రోజులుగ సోషల్ మీడియాలో వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో దానిపై తాజాగా రతన్ టాటా వివరణ ఇచ్చారు.

Also Read మాస్కుతో మోడీ దర్శనం: 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ సీఎంలకు అభయం...

‘‘ఈ పోస్టు నేను చెప్పింది కాదు.. నేను రాసింది కాదు.. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్న ఈ వార్తపై వాస్తవం తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను ఏదైనా చెప్పదల్చుకుంటే.. అధికారిక మార్గాల్లోనే చెబుతాను. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి..’’ అని వ్యాఖ్యానించారు. 

కాగా కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితిపై రతన్ టాటా కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో్ ఓ నకిలీ వార్త వైరల్ అవుతోంది. 

‘‘భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందంటూ ఎందరో నిపుణులు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిపుణులెవరో నాకు అంతగా తెలియదు. అయితే మానవ స్ఫూర్తి, దృఢ సంకల్పం గురించి వీళ్లకేమీ తెలియదని మాత్రం చెప్పగలను. నిపుణులు చెప్పే మాటే నిజమైతే... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక జపాన్‌కు భవిషత్తే లేదన్నారు. కానీ అదే జపాన్ మూడు దశాబ్దాలు తిరిగే సరికి మార్కెట్ వద్ద అమెరికాకు ముచ్చెమటలు పట్టించింది. నిపుణులు చెప్పేదే నిజమైతే అరబ్బుల కారణంగా ఇజ్రాయెల్ ఈ పాటికి ప్రపంచ పటం నుంచి కనిపించకుండా పోవాలి. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిపుణులమని చెబుతున్న వారి మాటే నమ్మాల్సి వస్తే.. 1983లో మనకు క్రికెట్ ప్రపంచ కప్ వచ్చేదే కాదు. కరోనా వైరస్ కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు. మనం కరోనాను జయించి తీరతామని నిస్సందేహంగా చెప్పగలను. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటుంది..’’ అని సదరు పోస్టులో రాశారు. దానిని తాజాగా రతన్ టాటా ఖండించారు.