జార్జ్ సోరోస్‌కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అతను న్యూయార్క్‌లో కూర్చుని తన అభిప్రాయాలు, ఆలోచనలే ప్రపంచ మనుగడను నిర్ణయించాలనే ఒపీనియన్స్ ఉన్నవారని అన్నారు. ఇటీవలే మ్యూనిచ్‌లో జార్జ్ సోరోస్ భారత ప్రజాస్వామ్యం, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యం, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశకంర్ దీటైన కౌంటర్ ఇచ్చారు. మూడే పదాలతో అతన్ని వర్ణించి సమాధానం ఇచ్చారు. జార్జ్ సోరోస్ ముసలాయన అని, ధనికుడు అని పేర్కొంటూ ఈ ప్రపంచమంతా ఆయన ఆలోచనలకు, అభిప్రాయాలకు లోబడే నడుస్తుందనే ఆలోచనలు గలవాడని (ఒపీనియేటెడ్) విమర్శించారు. అలాంటి వారు ఎన్నికల్లో తాము కోరుకున్న పార్టీ గెలిస్తే ఎలక్షన్స్ గొప్పతనాన్ని చెబుతారని, అదే ప్రత్యర్థి పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం సరిగా లేదని ఆరోపణలు చేస్తారని అన్నారు.
‘జార్జ్ సోరోస్ ఒక వయోవృద్ధుడు, సంపన్నుడు, తన అభిప్రాయాలే ఈ ప్రపంచ మనుగడను నిర్దేశించాలనే అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. న్యూయార్క్‌లో కూర్చుని అతను ఇదే ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తులు ఒక అభిప్రాయాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే పెట్టుబడి వనరులు వినియోగిస్తారు. జార్జ్ సోరోస్ వంటి వారే తాము కోరుకున్న పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఎలక్షన్స్ మంచివని, ఓడిపోతే ప్రజాస్వామ్యమే సరిగా లేదని కామెంట్ చేస్తారు. ఓపెన్ సొసైటీ అడ్వకసీ అని గొప్పగా పేర్కొంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు’ అని జైశంకర్ మండిపడ్డారు.
జైశంకర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ద్వైపాక్షి సంబంధాలపై ఆ దేశ నాయకులతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఫిజి నుంచి ఆయన నేరుగా ఆస్ట్రేలియాకే వెళ్లారు.
బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ భారత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం దుమారం రేపింది. భారత బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్ ట్రబుల్స్‌తో భారత ప్రజాస్వామ్యం పునరుజ్జీవనం చెందుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సి ఉన్నదని ఆయన మ్యూనిచ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారత దేశంపై దాడిగానే పరిగణించాలని అన్నారు. భారత ప్రజాస్వామిక ప్రక్రియలను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తులను ప్రతి భారతీయుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు.
