బాణాసంచా గోడౌన్ లో పేలుడు.. నలుగురు మృతి, మరో నలుగురికి గాయాలు.. సీఎం సంతాపం
తమిళనాడులోని మైలాడుదురైలో ఉన్న బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తమిళనాడులోని మైలాడుదురైలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి బాణాసంచా తయారీ గోడౌన్ లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైలాడుదురైలో ఉన్న బాణాసంచా గోదాంలో ఎప్పటిలాగే బుధవారం కూడా కార్మికులు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే అప్పటికే నలుగురు కార్మికులు మరణించారు. వీరిని మాణికం, మదన్, రాఘవన్, నికేష్ గా గుర్తించారు. మరో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని వెంటనే మైలాడుతురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో గోడౌన్ యజమాని మోహన్ లైసెన్స్ పొందినట్లు తేలింది. కాగా.. పేలుడుకు సంబంధించి తదుపరి విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందగానే మైలాడుతురై జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మణిమేకలై, ఆర్డీవో అర్చన, నాగపట్టణం ఎస్పీ హర్ష్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణించిన ప్రతీ కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటన విడుదల చేశారు.