మహువా మొయిత్రాపై నగదుకు-ప్రశ్నల ఆరోపణలు: బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ సిఫారసు
నగదుకు-ప్రశ్నల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: నగదుకు- ప్రశ్నల ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను ఎంపీ సభ్యత్వం నుండి బహిష్కరించాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రిపోర్టును శుక్రవారంనాడు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.
ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైన సమయంలో ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ కుమార్ సోంకర్ సమర్పించారు.మహువా మెయితా తీవ్ర ప్రవర్తన నేపథ్యంలో ఆమె ఎంపీ సభ్యత్వం నుండి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. మహువా ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా ప్రవర్తనకు శిక్షించాలని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రవేశ పెట్టిన సమయంలో టీఎంసీ,కాంగ్రెస్ సభ్యులు సభలో కమిటీ నివేదిక కోసం నినాదాలు చేశారు. ఎథిక్స్ కమిటీ సిఫారసులపై ఓటింగ్ జరిగే ముందుకు ఈ నివేదికపై చర్చ జరగాలని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ 104 పేజీల నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది.
2023 అక్టోబర్ 15న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు. డబ్బులు తీసుకొని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని నిషికాంత్ దూబే ఆరోపించారు.
పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మూడు అంశాలపై సమగ్రంగా విచారణ నిర్వహించింది. మహువా మెయిత్రా అనైతిక ప్రవర్తన, పార్లమెంట్ నియామాలను ధిక్కరించడం, ఎంపీల లాగిన్ ను అనధికార వ్యక్తికి అప్పగించడంపై విచారించింది.మహువా మొయిత్రాపై తీవ్ర ఆరోపణలు నిజమని నివేదిక తేల్చింది. మహువా మెయిత్రా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది.మహువా మెయిత్రా ప్రవర్తన అనైతికంగా, నేరంగా ఉందని కూడ రిపోర్టు తెలిపింది.డబ్బులు, ఇతర సౌకర్యాలు తీసుకొని పార్లమెంట్ గౌరవాన్ని మహువా దిగజార్చారని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది.
పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ 104 పేజీల వివరణాత్మక నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది. ఇందులో మహువా మొయిత్రా విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలు కూడ ఇచ్చారు.మహువా మెయిత్రా న్యూఢిల్లీ నుండి దుబాయ్ కు చాలా సార్లు వెళ్లారు. లండన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాల పర్యటనలను కూడ ఎథిక్స్ కమిటీ పేర్కొంది.
తన లాగిన్, పాస్ వర్డ్ ను అనధికార వ్యక్తికి ఇచ్చినందుకు మహువా మెయిత్రాను ఎథిక్స్ కమిటీ దోషిగా నిర్ధారించింది. ఈ ఎథిక్స్ కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికకను అనుకూలంగా ఓటు వేశారని తెలిపింది. ఈ కమిటీలోని మరో నలుగురు సభ్యులు ఈ సిఫారసును వ్యతిరేకించారని ఎథిక్స్ కమిటీ తెలిపింది.