న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. జస్వంత్ సింగ్ 1938 జనవరి 3వ తేదీన రాజస్థాన్ లో జన్మించారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. బిజెపి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది. రాజ్యసభలోనో, లోకసభలోనో ఆయన 1980 నుంచి 2014 వరకు కొనసాగుతూ వచ్చారు.

అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో ఆయన వివిధ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలను ఆనయ నిర్వహించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బిజెపి నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

జస్వంత్ సింగ్ మృతికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. మాజీ బిజెపి నేత అయిన జస్వంత్ సింగ్ వివిధ హోదాల్లో దేశానికి సేవలుచేశారని, రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.

జస్వంత్ సింగ్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జస్వంత్ సింగ్ మృతికి తనకు ఎనలేని విచారాన్ని కలిగించిందని ఆయన అన్నారు.