ఇండోర్ లో ఓ మాజీ విద్యార్థి ఘాతుకానికి తెగబడ్డాడు. మార్కల లిస్ట్ ఇవ్వడం లేదని మహిళా ప్రిన్సిపల్ మీద పెట్రోల్ చల్లి, నిప్పంటించాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది.  

ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. కాలేజీ అయిపోయి బయటికి వెళ్లిన పూర్వ విద్యార్థి ఒకరు మహిళా ప్రిన్సిపల్ మీద పెట్రోల్ చల్లి, నిప్పంటించాడు. అతని మార్కుల జాబితాను ప్రిన్సిపల్ ఇవ్వడం లేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిరుడు ఈ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఆ విద్యార్థి పేరు ఆశుతోష్ శ్రీ వాస్తవ (24). ఘటన జరిగిన కాలేజ్ పేరు బిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ ఘటన సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో చోటుచేసుకుంది. 

అశుతోష్ శ్రీ వాస్తవ నిరుడు జులైలో బి ఫార్మా ఉత్తీర్ణుడయ్యాడు. అయితే అప్పటి నుంచి.. తాను ఉత్తీర్ణుడైనప్పటికీ మార్కుల జాబితా ఇవ్వడానికి ప్రిన్సిపల్ విముక్త శర్మ (54), కాలేజీ సిబ్బంది సుముఖంగా లేరని.. ఆగ్రహించాడు. సోమవారం నాడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లిన ఆశుతోష్ శ్రీ వాస్తవ మరోసారి మార్కుల జాబితా గురించి అడిగాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోలు ఆమె మీద చల్లి, నిప్పంటించాడు శ్రీ వాత్సవ.

బస్సులో రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకు వెళ్లిన ప్రయాణికుడు.. తీర్పు ఏమిచ్చారంటే..

ప్రిన్సిపల్ గదిలో నుంచి మంటలు రావడంతో అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే పరిగెత్తి చూడగా అప్పటికే ఆమె మంటల్లో పూర్తిగా కాలిపోతూ కనిపించింది. వెంటనే మంటలు ఆర్పిన సిబ్బంది విముక్తశర్మను ఆసుపత్రికి తరలించారు. అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం అక్కడ నుంచి ఆశుతోష్ శ్రీ వాస్తవ పరారయ్యాడు. విముక్తశర్మను పరీక్షించిన వైద్యులు ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయిందని తెలిపారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సిబ్బంది ఫిర్యాదు పేరుకు ప్రిన్సిపల్ పై దాడి చేసిన తర్వాత పారిపోయిన నిందితుడు ఆశుతోష్ శ్రీ వాస్తవను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రిన్సిపాల్ విముక్త శర్మపై దాడి చేసిన ఆశుతోష్ శ్రీ వాస్తవ అంతకు ముందు కూడా ఓ ప్రొఫెసర్ పై ఇలాంటి దాడికే దిగాడని తెలిసింది. నాలుగు నెలల క్రితం కూడా ఒకసారి.. మార్కుల లిస్ట్ కోసం ప్రొఫెసర్ తో గొడవపడిన ఆశుతోష్ శ్రీ వాస్తవ కత్తితో దాడి చేసినట్లుగా సమాచారం. అయితే, మార్కుల లిస్టు ఇంకా కాలేజీకి చేరనందుకే ఆశుతోష్ శ్రీ వాస్తవకు ఇవ్వలేకపోయామని యాజమాన్యం తెలిపింది.