2019లో, శాంతినగర్-మెజెస్టిక్ బస్సులో ప్రయాణించిన రమేష్ నాయక్ అనే వ్యక్తికి ఒక రూపాయి చిల్లర కండక్టర్ తిరిగివ్వలేదు. దీంతో అతను వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
బెంగళూరు : పోరాడే ఓపిక ఉండాలే కానీ వినియోగదారుల ఫోరంతో ఎన్నో విషయాల్లో అనుకూలమైన తీర్పులు వస్తుంటాయి. అలాంటిదే ఈ కేసు. బెంగళూరులో ఓ వ్యక్తి ఒక్క రూపాయి చిల్లర ఇవ్వలేదని కండక్టర్ మీద వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీంతో ఈ కేసును పరిశీలించిన కోర్టు అతనికి రూ.2000 నష్టపరిహారం, కోర్టు ఖర్చులకు గానూ రూ.1000 చెల్లించాలని ఆదేశించింది.
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర లేకపోతే.. టికెట్ వెనక రాయడం.. అది గుర్తుపెట్టుకుని అడగడం మర్చిపోయి దిగిపోవడం.. దాదాపుగా అందరికీ అనుభవంలోని విషయమే. చాలాసార్లు కండక్టర్లు ఒక్క రూపాయి, రెండు రూపాయలకు కూడా చిల్లర లేదంటూ టికెట్ వెనక రాస్తుంటారు. ఒక్కోసారి ఇది వంద రూ.ల వరకు వెళ్లిన ఘటనలూ ఉంటాయి. ఇంటికి వచ్చాక టికెట్ చూసుకునో...లేక బస్సు వెళ్లిపోయాకో గుర్తుకు వచ్చి ఆ రోజంతా... కండక్టర్ ను తిట్టుకుంటూనే ఉండే ఘటనలూ అందరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంటాయి.
పెద్ద మొత్తం అయితే స్థానిక బస్ డిపోలకు వెళ్లి టికెట్ చూపిస్తే ఇచ్చే సౌలభ్యం కొన్ని చోట్ల, కొన్నిసార్లు అందుబాటులో ఉంటుంది. కానీ ఒకటో, రెండో రూపాయలు అయితే.. పోనీలే అని వదిలేస్తాం. ఒకవేళ గుర్తు పెట్టుకుని అడిగినా కండక్టర్ కూడా విసుక్కుంటాడు. ఒక్కరూపాయి కోసం వెంటబడుతున్నారని చిరాకు పడడం, టికెట్ కు సరిపడా చిల్లర తెచ్చుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వింటుంటాం. అలాంటిదే ఈ ఘటన. అయితే, సదరు ప్రయాణికుడు మాత్రం వదలలేదు. కోర్టుకు వెళ్లాడు. వివరాల్లోకి వెడితే...
17యేళ్ల బాలికపై తండ్రి, సోదరుడి లైంగిక వేధింపులు.. స్కూల్లో టీచర్లకు చెప్పడంతో వెలుగులోకి...
2019లో, రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుండి మెజెస్టిక్ బస్ డిపోకు బీఎంటీసీ బస్సులో ప్రయాణించాడు, ఆ సమయంలో కండక్టర్ రూ. 29కి టిక్కెట్ ఇచ్చాడు. ఫిర్యాదుదారు రూ. 30 చెల్లించాడు, దాని చిల్లర తిరిగి ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ వ్యక్తికి రూ.2,000 పరిహారం చెల్లించాలని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)ని బెంగళూరు కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడి లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బిఎంటిసిని కోర్టు ఆదేశించింది.
అంతేకాదు.. చిల్లర అడిగినందుకు బస్సు కండక్టర్ రమేష్‌పై అసభ్యంగా ప్రవర్తించి, అరిచాడు. ఈ విషయాన్నిబీటీసిటీసి దృష్టికి తీసుకువెడితే వాళ్లు కూడా పట్టించుకోలేదు. రూ. 1ని తిరిగి చెల్లించలేదు. దీంతో బిత్తర పోయిన రమేష్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడని.. ఆర్డర్ పేర్కొంది. అయితే, ఇది మాములు అంశమని బీఎంటీసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సర్వీస్‌లో లోపం ఉందన్న ఆరోపణను కొట్టిపారేసింది. ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది. అయితే, రమేష్ చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు, ఈ నేపథ్యంలో పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
‘ఇక్కడ రూపాయి చిల్లర విషయం సమస్య కాదు. కండక్టర్ ప్రవర్తన సమస్య. అలాగే ఇది వినియోగదారుడి హక్కుగా పరిగణనలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. విషయం చిన్నదిగా కనిపిస్తుంది. కానీ, ఇది వినియోగదారుడి హక్కుకు సంబంధించిన అంశంగా గుర్తించబడాలి అని కోర్టు తెలిపింది. అందుకే అతనికి నష్టపరిహారం ఇవ్వాలని” కోర్టు పేర్కొంది.
ఫిర్యాదుదారుడు రూ.15,000 నష్టపరిహారం కోరగా, కోర్టు ఫీజు కోసం రూ.1,000తో పాటు రూ.2,000 పాక్షిక ఉపశమనం చెల్లించాలని కోర్టు బీఎంటీసీని ఆదేశించింది. ఆర్డర్ ఇచ్చిన 45 రోజులలోపు మొత్తాన్ని చెల్లించాలని బీఎంటీసీని ఆదేశించింది, లేని పక్షంలో సంవత్సరానికి రూ. 6,000 వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది.
