Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా.. గెలిచి అసెంబ్లీకొచ్చినా వదలను: సిద్ధూపై అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. సిద్ధూ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీలో అవసరమైతే బలనిరూపణ కోరతానని అమరీందర్ స్పష్టం చేశారు

ex punjab cm amarinder singh sensational comments on pcc chief navjot singh sidhu
Author
Chandigarh, First Published Sep 30, 2021, 7:37 PM IST

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. సిద్ధూ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీలో అవసరమైతే బలనిరూపణ కోరతానని అమరీందర్ స్పష్టం చేశారు. సిద్ధూని ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిపించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. 

మరోవైపు తాను కాంగ్రెస్‌లో వుండలేనని.. అలాగని బీజేపీలో చేరడం లేదన్నారు అమరీందర్ సింగ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త పార్టీ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ దిగజారుతోందని, సిద్ధూ లాంటి వ్యక్తికి పార్టీలో సీరియస్ పనులు అప్పగించిందని ఆయన దుయ్యబట్టారు.

నేను 52 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. కానీ, ఆయన నాతో ఎలా ప్రవర్తించారని అమరీందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నాతో పదిన్నర గంటలకు మీరు రాజీనామా చేయండి అని చెప్పారని.. తాను ఎలాంటి ప్రశ్నలూ అడగలేదని గుర్తుచేశారు. నాలుగు గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్లి రాజీనామా ఇచ్చానని... 50 ఏళ్ల తర్వాత కూడా మీరు నన్ను సందేహిస్తుంటే, నా విశ్వసనీయతే ప్రమాదంలో పడినప్పుడు, ఎలాంటి నమ్మకం లేనప్పుడు పార్టీలో ఉండడంలో అర్థం లేదని అమరీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, అమరీందర్ సింగ్ ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నిన్న భేటీ అయిన అమరీందర్ సింగ్.. ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. అమరీందర్ సింగ్.. భాజపాలో చేరే అవకాశం ఉందని పలు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే అమరీందర్ సింగ్ భార్య ప్రీణీత్ కౌర్‌కు పీసీసీ చీఫ్ పదవి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios