ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో దేశంలో దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి (president election 2022) కనిపిస్తోంది. ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము (draupadi murmu) .. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా (yashwant sinha) బరిలో నిలిచారు. ఎన్డీయేకు వున్న బలాబలాలు, ఇతర పార్టీల మద్ధతు నేపథ్యంలో ద్రౌపది ముర్ము విజయం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే గట్టి పోటీని ఇవ్వాలని విపక్షాలు కూడా గట్టిగా వున్నాయి. ఈ మేరకు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఇదిలావుండగా త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నిక (vice president elections) కూడా జరగనుంది. వెంకయ్య నాయుడుకు మరో ఛాన్స్ ఇస్తారా లేక మరో వ్యక్తిని అభ్యర్ధిగా బీజేపీ నిలబెడుతుందా అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన కార్యాలయం కూడా ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read:పీఎల్‌కేను బీజేపీలో విలీనం చేయనున్న అమరీందర్ సింగ్! వచ్చే వారంలో ప్రకటన?
ప్రస్తుతం అమరీందర్ సింగ్ (captain amarinder singh) శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ఆపరేషన్ పూర్తి చేసుకుని , భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కెప్టెన్ .. ఆరోగ్యంపై మోడీ వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరీందర్ సింగ్ ‘‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’’ పేరిట వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. పటియాలాలో స్వయంగా అమరీందర్ కూడా పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇకపోతే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. జూలై 5 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
