కూతురు వివాహం నాడే... ఆమె మాజీ ప్రేమికుడు తండ్రిని దారుణంగా నరికి చంపాడు. తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి తెగించాడు. 

తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొద్ది గంటల్లో కుమార్తె పెళ్లి జరగనుండగా.. కొందరు దుండగులు అతడిని నరికి చంపారు. మృతుడు వర్కాల వడస్సేరికోణంకు చెందిన రాజు(63). అతడిని అతని పక్కింట్లో ఉండే జిష్ణు అనే యువకుడు, అతని స్నేహితులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజు కుమార్తె శ్రీలక్ష్మి, నిందితుడు జిష్ణులు ప్రేమించుకున్నారు. 

అయితే, వీరి ప్రేమను నిరాకరించిన కుటుంబం.. శ్రీలక్ష్మికి వేరే సంబంధం నిశ్చయం చేసింది. జిష్ణు చేసిన పెళ్లి ప్రతిపాదనను రాజు కుటుంబం తిరస్కరించింది. రాజు కుమార్తె వివాహం బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగాల్సి ఉంది. వివాహానికి ముందురోజు, కుటుంబం స్నేహితులు, కుటుంబ సభ్యులకు విందును ఏర్పాటు చేసింది. వారంతా వెళ్లిపోయిన తర్వాత, జిష్ణు, అతని సోదరుడు, ఇద్దరు స్నేహితులు-మను, శ్యామ్ అర్ధరాత్రి సమయంలో కుటుంబంతో గొడవకు దిగారు,

బిజీ రోడ్డులో కూలిన ఇనుప పిల్లర్.. షాకింగ్ వీడియో వైరల్...

ఈ గొడవలో నిందితుల్లో ఒకరు రాజును కొడవలితో నరికి, కత్తితో పొడిచాడు. అరుపులు విన్న రాజు సోదరుడు, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చేసరికి నలుగురు నిందితులు ఇంట్లో నుండి పారిపోయారు. గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. 

రాజు 25 ఏళ్లు విదేశాల్లో ఉండి.. ఇటీవలే కేరళకు తిరిగివచ్చి.. కుటుంబంతో ఉంటున్నాడు. కేరళలో అతను ఆటోరిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కల్లంబాలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున ఒంటి గంటకు ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నలుగురూ అక్కడి నుంచి పారిపోవడంతో.. వారిని వెంబడించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.