1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ (70) కరోనాతో మరణించారు. ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

1984 సిక్కు అల్లర్ల కేసులో పదేళ్లు శిక్ష పడటంతో ఆయన 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్‌లో ఉంటున్నాడు. ఇదే బ్యారక్‌లో ఉంటున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ జూన్ 15న మృతిచెందడంతో శవపరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

Also Read:'కొవాగ్జిన్' పై వివాదం: అన్ని పరిశీలించాకే ట్రయల్స్‌కు అనుమతి... ఐసీఎంఆర్‌ ప్రకటన

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ బ్యారక్‌లో ఉంటున్న 29 మంది వృద్ధ ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా మహేందర్ యాదవ్‌తో పాటు అందరికీ పాజిటివ్‌ వచ్చింది. వెంటనే ఆయనను జూన్ 26న ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యుల అభ్యర్ధన మేరకు ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.

Also Read:బంగారు మాస్కు... అయినా తప్పదు కరోనా రిస్కు

ఢిల్లీలోని పాలమ్ నియోజకవర్గం నుంచి యాదవ్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. మరోవైపు ఢిల్లీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం రాత్రి నాటికి కరోనా బాధితుల సంఖ్య 97,200కు చేరింది. 3,004 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 25,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.