నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మనవడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. 2016లో చేరి బెంగాల్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా లేఖ రాశారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ తనకు సహకరించలేదని ఆరోపించారు. 

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మునిమనవడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. జాతీయవాద నేత నేతాజీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ తనకు సహకరించలేదని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ‘నేను బీజేపీలో చేరినప్పుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ సంఘటిత భావజాల వ్యాప్తికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ సంభవించలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2016లో చంద్రబోస్ బీజేపీలో చేరారు. 2016లో అసెంబ్లీ ఎన్నికలకు, 2019లో లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆయనకు అవకాశం దక్కింది. 2016లో పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2020 సంస్థాగత మార్పుల్లో ఆయనను తొలగించారు.

‘నేతాజీ సుభాశ్ చంద్రబోస్, ఆయన అన్నయ్య శరత్ చంద్రబోస్‌ల సంఘటిత భావజలం కేంద్రంగా అప్పటి బీజేపీతో నా చర్చలు జరిగాయి. బీజేపీ వేదికపై దేశవ్యాప్తంగా ఈ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నాకు అనుమతి ఇచ్చారని భావిస్తున్నాను. బీజేపీ ఫ్రేమ్‌వర్క్‌లోనే నేతాజీ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఆజాద్ హింద్ మోర్చా ఏర్పాటుకు నిర్ణయం జరిగింది కూడా. ఈ మోర్చా ద్వారా కులం, మతం, జాతికి అతీతంగా అందరినీ భారతీయులుగా ఏకం చేయాలనేది తన లక్ష్యం’ అని ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

Also Read: సెప్టెంబర్ 17న 10 లక్షల మందితో సభ.. సోనియా ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారు: రేవంత్

దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను చేరడానికి తన ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని వివరించారు. కేంద్రం నుంచైనా.. బెంగాల్ బీజేపీ స్థాయిలోనైనా ఎలాంటి సహకారం అందలేదని తెలిపారు. ప్రజలకు చేరువ కావడానికి తాను సమగ్రమైన బెంగాల్ స్ట్రాటజీని వారి ముందు ఉంచానని, కానీ, తన ప్రతిపాదనలను విస్మరించారని పేర్కొన్నారు.

తన రాజీనామాపై రాష్ట్ర బీజేపీ ప్రతినిధి సామిక్ భట్టాచార్య స్పందిస్తూ.. ఆయన చాలా కాలం నుంచి పార్టీకి టచ్‌లో లేరని వివరించారు.