దేశవ్యాప్తంగా పేటీఎం, పేయూ వంటి పేమెంట్ గేట్‌వే సంస్థల్లో బుధవారం తనిఖీలు జరిపింది. లోన్ యాప్ వ్యవహారంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా పేమెంట్ గేట్‌వేలపై ఈడీ సోదాలు నిర్వహించింది. పేటీఎం, పేయూ సంస్థల్లో బుధవారం తనిఖీలు జరిపింది. లోన్ యాప్ వ్యవహారంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పేటీఎం, పేయూ గేట్‌వేల ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఈ రెండు గేట్‌వేల ద్వారా సింగపూర్, మలేషియాకు నిధులు మళ్లించినట్లుగా తేల్చారు. 

కాగా.. లోన్ యాప్స్ కేసులకు సంబంధించి సెప్టెంబర్ 10న పశ్చిమ బెంగాల్‌లో ఏడు చోట సోదాలు నిర్వహించారు అధికారులు. అప్పుడు దాదాపు రూ. 7 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. గేమింగ్ పేరుతో యాప్‌ను తయారు చేసిన కోల్‌కతా చెందిన వ్యాపారి అమీర్ ఖాన్ .. దీని ద్వారా భారీగా డబ్బులు వసూలు చేశాడు. తక్కువ సమయంలోనే గేమింగ్ యాప్‌ను లోన్ యాప్‌గా మార్చేశాడు. ఈ లోన్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చి అధిక వడ్డీతో వసూళ్లకు పాల్పడ్డాడు. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నాడు. మనీలాండరింగ్, హవాలాకు కూడా పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా చైనాకు కూడా డబ్బులు పంపుతున్నట్లు ఈడీ గుర్తించింది. దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ దాడులకు దిగింది. 

Also REad:లోన్‌ యాప్స్‌పై కేంద్రం సీరియస్: రంగంలోకి ఈడీ.. కోల్‌కతా వ్యాపారి ఇంట్లో సోదాలు... రూ.7 కోట్ల నగదు సీజ్

ఇకపోతే.. దేశంలో అక్ర‌మ డిజిట‌ల్ లోన్ యాప్స్ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ యాప్స్ మోసాల‌ను, వేధింపుల‌ను భ‌రించ‌లేక ఎంతోమంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వాటి ఆగ‌డాల‌కు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యాప్స్ విష‌యాన్ని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అక్రమ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌కు సంబంధించిన పలు అంశాలపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, రెవిన్యూ, ఆర్థిక సేవలు, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల కార్యదర్శులతోపాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలో కీలక నిర్ణయం తీసున్నారు.

చట్టపరమైన, విధానపరమైన, సాంకేతిక అంశాలపై వివరణాత్మక చర్చల తర్వాత... ఆర్బీఐ(RBI) అక్ర‌మ రుణ‌ యాప్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం సక్రమంగా నడుస్తున్న రుణ‌ యాప్స్‌ జాబితా( వైట్ లిస్ట్)ను త‌యారు చేయాల‌ని ఆర్బీఐకి ఆర్థిక మంత్రి సూచించారు. ఈ వైట్ లిస్ట్ లోని యాప్స్‌ మాత్రమే.. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ చ‌ర్చ‌లు తీసుకోనున్న‌ది. దీంతో అక్రమ రుణ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో కనుమరుగుకనున్నాయి.