జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. సైనికుడిని కాపాడుతూ, కాల్పులకు గురై ఆరేళ్ల ఆర్మీ కుక్క మృతి
సైనికులకు రక్షించుకుంటూనే ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ శునకం అమరత్వం పొందింది. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ శునకం తీవ్రంగా గాయపడి మరణించింది.
జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలో ఎన్ కౌంటర్ లో జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సైనికుడిని రక్షించే క్రమంలో కెంట్ అనే ఆరేళ్ల ఇండియన్ ఆర్మీ కుక్క ప్రాణాలు కోల్పోయింది. నార్లా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆ కుక్క భారీ కాల్పుల మధ్య చిక్కుకుంది.
‘‘ 21వ ఆర్మీ డాగ్ యూనిట్ లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ కుక్క కెంట్ తన హ్యాండ్లర్ ను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించింది. పారిపోతున్న ఉగ్రవాదుల కనిపెట్టేందుకు కెంట్ సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తోంది. భారీ ఎదురుకాల్పుల్లో అది కూలిపోయింది’’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
‘‘ఆపరేషన్ సుజలిగాలలో ఆర్మీ డాగ్ కెంట్ ముందంజలో ఉంది. పారిపోతున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు కెంట్ సైనికుల బృందాన్ని ముందుండి నడిపిస్తోంది. అయితే భారీగా జరిగిన కాల్పుల్లో దానికి గాయాలు అయ్యాయి. దాని హ్యాండ్లర్ ను కాపాడుకుంటూనే, భారత సైన్యం ఉత్తమ సంప్రదాయాలలో తన ప్రాణాలను అర్పించింది’’ అని రక్షణ శాఖ ప్రతినిధి వార్తా సంస్థ ‘పీటీఐ’తో చెప్పారు.
ఇదిలావుండగా.. రాజౌరీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక అనుమానిత పాక్ ఉగ్రవాది.. ఒక ఆర్మీ జవాను హతమయ్యారు. ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. నార్లా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఇందులో ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను మృతి చెందారని పేర్కొన్నారు మరో ఇద్దరు ఆర్మీ జవాన్లకు, ఓ ప్రత్యేక పోలీసు అధికారికి గాయాలు అయ్యాయని చెప్పారు.