జమ్మూ కాశ్మీర్ గురువారం ఉదయం తుపాకుల మోతతో మేల్కొంది. అవంతిపోరాలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన భద్రతా బలగాలు దాడులు చేపట్టాయి. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఆపరేషన్ కొనసాగుతోందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు.
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమయ్యింది. అవంతిపోరా ప్రాంతంలోని ట్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించగా ఉగ్రవాదులు బైటపడ్డారు. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నారు. భద్రతా సిబ్బంది సంయుక్త బృందాలు ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. .
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదులు ఏరివేతను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం షోపియాన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టారు.


