Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం:మల్లికార్జున ఖర్గే

సాధారణ  కార్మికుడి కొడుకు కాంగ్రెస్ పార్టీ  అధ్యక్ష బాధ్యతలు  చేపట్టడం తనను భావోద్వేగానికి గురి చేస్తుందని ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  చెప్పారు.

 Emotional moment for me,  son of labourer takes over Congress chief: Mallikarjun Kharge
Author
First Published Oct 26, 2022, 11:58 AM IST

న్యూఢిల్లీ: ఓ  సాధారణ కార్మికుడి కొడుకు  ఎఐసీసీ  చీఫ్ గా  బాధ్యతలు  చేపట్టడం ఒక  రకంగా  తనను భావోద్వేగానికి గురి  చేస్తుందని ఎఐసీసీ  చీఫ్  మల్లికార్జున ఖర్గే  చెప్పారు.

ఎఐసీసీ చీఫ్  గా బుధవారంనాడు  న్యూఢిల్లీలోని  పార్టీ  కార్యాలయంలో  బాధ్యతలు  స్వీకరించిన  తర్వాత  ఆయన ప్రసంగించారు. ఇవాళ తన  జీవితంలో మర్చిపోలేని  రోజుగా  ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్  పార్టీ  వారసత్వాన్ని ముందుకు  తీసుకెళ్తానని  ఆయన  చెప్పారు. పార్టీలోని అందరి సహకారం తనకు  అవసరమన్నారు.తనపై  నమ్మకం  ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన  ధన్యవాదాలు  చెప్పారు.సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ  రెండు దఫాలు  కేంద్రంలో అధికారంలోకి  వచ్చిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ  ఏనాడూ కూడా  పదవులు ఆశించలేదన్నారు. దేశంలో  ప్రజాస్వామ్యాన్ని  బీజేపీ  అపహాస్యం చేస్తుందని ఆయన  విమర్శించారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తున్న విషయాన్ని  ఖర్గే గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన  చెప్పారు. ప్రతి పౌరుడికి సాధికారిత, సమానమైన భారతదేశాన్ని  నిర్మించడానికి  తమ వంతు ప్రయత్నం  చేస్తామన్నారు.  ఈ దేశంలోని  పౌరులందరికీ సమాన అవకాశాలు దక్కేందుకు తాము  ప్రయత్నిస్తామని ఆయన  చెప్పారు.ద్వేషాన్ని  వ్యాప్తి చేసే వారిని ఓడిస్తామని ఖర్గే పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యలు  చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై పోరాటం  నిర్వహిస్తామని ఆయన  ప్రకటించారు. 

హిమాచల్ ప్రదేశ్ ,గుజరాత్ రాష్ట్రాల  ప్రజలు  మార్పును  కోరుకుంటున్నారని  మల్లికార్జునఖర్గేచెప్పారు. ఈ  రెండు  రాష్ట్రాల్లో  జరిగే  ఎన్నికల్లో మన  సత్తా ఏమిటో చూపాలన్నారు.ప్రతి ఒక్క  కార్యకర్త  అంకితభావంతో పనిచేస్తే  విజయం  సాధిస్తామని ఖర్గే ధీమాను వ్యక్తం  చేశారు. మహాత్మాగాంధీ సైనికులమైన మనం ఎవరికీ భయపడబోమన్నారు. ఏనాడైతే  కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  భయాన్ని  వీడుతాడో అప్పుడే అతి పెద్ద  రాజ్యాలు  కూడ  పార్టీ వశమౌతాయని  ఆయన  చెప్పారు.

1969లో తాను బ్లాక్  కమిటీ చీఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించానన్నారు. ఇవాళ పార్టీలో  అత్యున్నత  పదవికి చేరుకున్నట్టుగా పార్టీలో తన ప్రస్థానాన్ని గుర్తు  చేసుకున్నారు. గాంధీ,  నెహ్రులు మార్గనిర్ధేశం  చేసిన పార్టీవారసత్వాన్ని  ముందుకు  తీసుకెళ్లడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు.

also read:కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు: మల్లికార్జున ఖర్గేకి బాధ్యతలిచ్చిన సోనియా

దేశంలో  అబద్దాలు , దగా  రాజకీయాలను  బీజేపీ  పెంచి పోషిస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని విభజించే  ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దేశంలో  ప్రజాస్వామ్యాన్ని  విచ్ఛిన్నం  చేసే  ప్రయత్నాలు  సాగుతున్నాయన్నారు.భారత  రాజ్యాంగంపై కాంగ్రెస్  భావజాలం ఆధారపడి ఉందని ఆయన  చెప్పారు. దీన్ని కాపాడులకోవాల్సిన అవసరాన్న  ఆయన నొక్కి  చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios