సారాంశం

రేపు జమ్ము కశ్మీర్‌లో మాల్ ఆఫ్ శ్రీనగర్‌కు శంకుస్థాపన జరగనుంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమక్షంలో యూఏఈకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎమార్ ఈ మాల్‌కు శంకుస్థాపన చేస్తుంది. అనంతరం, యూఏఈ, ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సెషన్ జరుగుతుంది.
 

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లోకి పెట్టుబడులు వస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను కశ్మీర్ ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా మధ్యాసియా దేశాల నుంచి ఈ పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ షాపింగ్ మాల్‌ను యూఏఈకి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ఎమార్ నిర్వహించనుంది. ఈ భారీ మాల్‌ కోసం ఎమార్ సంస్థ గత ఒకట్రెండు సంవత్సరాల నుంచి ప్రణాళికలు చేసింది. రేపు (మార్చి 19వ తేదీన) ‘మాల్ ఆఫ్ శ్రీనగర్’‌కు శంకుస్థాపన చేయనుంది. ఇప్పటికే ఈ మాల్‌లో ఉండాల్సిన హైపర్ మార్కెట్, ఇతర స్టోర్‌ల గురించిన ప్రణాళికలు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ మాల్ ఆఫ్ శ్రీనగర్‌లో అబుదాబికి చెందిన లులు గ్రూప్ హైపర్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్టు ఇది వరకే కథనాలు వచ్చాయి.

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమక్షంలో జమ్ము కశ్మీర్‌లో ‘మాల్ ఆఫ్ శ్రీనగర్’కు ఆదివారం  ఎమార్ సంస్థ శంకుస్థాపన చేయనుంది. అనంతరం, యూఏఈ, భారత పెట్టుబడులపై ఓ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఐబీసీ), జమ్ము కశ్మీర్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తుంది. 

Also Read: వారం క్రితం ప్రధాని ఓపెన్ చేసిన హైవేపై వరద.. వాహనాల యాక్సిడెంట్లు.. మోడీ చెక్ చేశాడా? లేదా?: ప్రయాణికుల ఆగ్రహం

రేపు ఉదయం 10.30 గంటలకు మాల్ ఆఫ్ శ్రీనగర్‌కు ఎమార్ సంస్థ శంకుస్థాపన చేస్తుంది. శ్రీనగర్‌లోని సేంపొరాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు యూఏఈ, ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సెషన్ జరుగుతుంది. ఇందులోనూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. యూఏఈ, జమ్ము కశ్మీర్ మధ్య పెట్టుబడి సంబంధాలపై చర్చ జరుగుతుంది.