Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో మహిళలకు టికెట్లు ఇవ్వడం కూడా ఇస్లాంకు వ్యతిరేకమే: గుజరాత్‌లో మతపెద్ద వ్యాఖ్యలతో కొత్త వివాదం

ఎన్నికల్లో పోటీ చేయడానికి ముస్లిం మహిళలకు టికెట్ ఇవ్వడం ఇస్లాం వ్యతిరేకం అని అహ్మాదాబాద్‌లోని ఓ మత పెద్ద వ్యాఖ్యలు చేశారు. తద్వార మతం బలహీనం అవుతుందని తెలిపారు. మహిళలు చట్టసభల్లోకి వెళితే మతంలోని నిబంధనలు అమలు చేయడం దుస్సాధ్యం అవుతుందని వివరించారు.
 

election tickets to muslim women is against islam says gujarat cleric
Author
First Published Dec 4, 2022, 7:01 PM IST

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేయడానికి ముస్లిం మహిళలకు టికెట్ ఇవ్వడం కూడా ఇస్లాం మతానికి వ్యతిరేకమే అని గుజరాత్‌కు చెందిన ఓ మతపెద్ద చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. అహ్మదాబాద్‌లోని జామా మసీదులోని షాహి ఇమామ్ షబ్బీర్ అహ్మద్ సిద్దిఖీ ముస్లిం మహిళలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడంపై మాట్లాడారు. ముస్లిం మహిళలకు ఎన్నికల్లో ఇస్లాం మతానికి వ్యతిరేకం అని, అది ఇస్లాం మతాన్నే బలహీనపరుస్తుందని అన్నారు. పురుషులుండగా మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటీ? అని ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన కర్ణాటక హిజబ్ వివాదాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ‘ఒక వేళ మీరు మహిళలను ఎమ్మెల్యేలు, మంత్రులను, కౌన్సిలర్లను చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సందర్భాల్లో మేం హిజబ్ నిబంధనను అమలు చేయలేం. ఈ హిజబ్ కచ్చితంగా ధరించడానికి అనుమతించాలనే సమస్యనూ లేవనెత్తలేం’ అని అన్నారు. ‘హిజబ్ సమస్యపై ఇప్పుడు ప్రభుత్వం ముందు లేవనెత్తాం. ప్రభుత్వం దానికి సమాధానం ఇస్తుంది. కానీ, మహిళలను ఎన్నుకుని చట్టసభలకు పంపితే.. మీ మతం మహిళలు అసెంబ్లీ హాల్స్, పార్లమెంట్, మున్సిపల్ బోర్డుల్లోనూ కూర్చుంటున్నారు కదా? అనే ప్రశ్న వస్తుంది’ అని తెలిపారు.

Also Read: ఇరాన్‌లో రద్దీ మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. తమ మతం మహిళలు ఇస్లాం, హిందూ మతం అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి క్యాంపెయిన్ చేయడానికి తిరగాల్సి ఉంటుందని ఆ మత పెద్ద అన్నారు. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాల్సి ఉంటుందని తెలిపారు. ఇస్లాం మతంలో మహిళ గొంతు నుంచి వినిపించే మాట కూడా మహిళతో సమానం అని పేర్కొన్నారు.

ఒక వేళ చట్టపరంగా సీటు మహిళలకే రిజర్వ్ చేసి ఉంటే... మాత్రం తప్పనిసరి అంటే మాత్రమే మహిళలకు టికెట్లు ఇస్తే అంగీకరిస్తామని వివరించారు. ఢిల్లీ బల్దియా ఎన్నికలను పరిశీలిస్తే.. మహిళలు, యువతులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే.. తన అభిప్రాయం ప్రకారం మహిళలను తమ నియంత్రణలోకి తీసుకుంటే వారి కుటుంబం మొత్తాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవచ్చనే ఆలోచనే దీనికి కారణం అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios