మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే షిండే మాట్లాడుతూ.. తాము తీసుకున్న ఈ నిర్ణయం బాలాసాహెబ్ భావజాలం, హిందుత్వ ఎజెండాకు కట్టుబడి ఉందని చెప్పారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ను కలిసిన షిండే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని తెలియజేశారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తాము తీసుకున్న ఈ నిర్ణయం బాలాసాహెబ్ భావజాలం, హిందుత్వ ఎజెండాకు కట్టుబడి ఉందని చెప్పారు. తన వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ది పనులకు కూడా ఈ నిర్ణయం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

తనకు మద్దతుగా నిలిచిన బీజేపీకి నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఏకనాథ్ షిండే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఫడ్నవిస్‌కు చాలా పెద్ద హృదయం ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’’ అని షిండే పేర్కొన్నారు. ‘‘మేము వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించడం ప్రారంభించిన తర్వాత మా నియోజకవర్గాలకు సంబంధించిన మనోవేదనలు, అభివృద్ధి పనులతో పాటు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని గురించి మాజీ సీఎం ఠాక్రే వద్దకు వెళ్లాము. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ చేశాం’’ అని షిండే చెప్పారు.

Also Read: మహారాష్ట్ర రాజకీయంలో ఊహించని ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే.

‘‘శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో సహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు... వారి సహకారంతోనే మేము ఇంతవరకు ఈ యుద్ధం చేశాం. ఈ 50 మంది నాపై ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేయను’’ షిండే తెలిపారు. 

‘‘బీజేపీకి 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పదవి వదులుకున్నారు. పెద్ద మనసు చాటుకున్నారు. బాలాసాహెబ్‌ సైనిక్‌ (పార్టీ కార్యకర్త)ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలతో పాటు ఫడ్నవీస్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.