మహరాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్ నాథ్ షిండే బుధవారం తెల్లవారుజామున గుజరాత్ ను విడిచిపెట్టి అస్సాంకు పయనమయ్యారు. ఆయనతో పాటు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గౌహతిలో వారంతా ఉండనున్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే, 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం గుజరాత్ లోని సూరత్ ను వదిలిపెట్టారు. వారంతా అస్సాం బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి సమయంలో గౌహతికి వెళ్లేందుకు వారంతా సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి విమానంలో బయలుదేరారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. “ మేము బాలాసాహెబ్ ఠాక్రే కు చెందిన శివసేనను విడిచిపెట్టలేదు. దానిని విడిచిపెట్టబోము కూడా. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నా కోరిక. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే కోరుకుంటున్నారు. నేను పార్టీని వీడేది లేదు.’’ అని వార్తా సంస్థ IANS తో ఆయన తెలిపారు. తాను ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపానని, ‘జై మహారాష్ట్ర, గర్వ్ సే కహో హమ్ హిందూ హై’ అనే నినాదాలు కూడా చేశానని ఏక్ నాథ్ షిండే ధృవీకరించారు.
Maharashtra Political Crisis: 'మహా' రాజకీయ సంక్షోభం..! పతనం తప్పదా?
మంగళవారం ఛాతీ నొప్పితో హాస్పిటల్ లో చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన నితిన్ దేశ్‌ముఖ్ బస్సు దిగి స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ బోర్డింగ్ కౌంటర్ వద్దకు నడుచుకుంటూ కనిపించారు. అక్కడ అన్ని లాంఛనాలు పూర్తయిన తర్వాత శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం దాదాపు 200 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానంలో ఎక్కారు. బోర్డింగ్ ప్రక్రియ తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగుతుందని IANS తెలిపింది.
కాగా సోమవారం రాత్రి సూరత్ చేరుకున్న తర్వాత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్రలోని తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు డుమాస్ రోడ్డులోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేశారు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వారందరినీ అస్సాంలోని గౌహతికి తరలించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం తెల్లవారుజామున 2:15 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి మూడు బస్సులలో ఒకదానిలో ఎక్కడం అక్కడి నుంచి విడులైన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నేతలు మోహిత్ కాంభోజ్, సంజయ్ కుటే విమానాశ్రయంలో వారి వెంట ఉన్నారు.
Droupadi Murmu Profile: ఇంతకీ ద్రౌపది ముర్ము ఎవరు? NDA అధ్యక్ష అభ్యర్థి వివరాలు
ఇదిలా ఉండగా తిరుగుబాటుదారులతో మాట్లాడేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం శివసేన నేతలు మిలింద్ నార్వేకర్, రవీంద్ర ఫాటక్‌లను హోటల్‌కు పంపారు. అయితే చర్చలు సజావుగా సాగలేదని తెలుస్తోంది. అయితే శివసేన పార్టీ కార్యకర్తలతో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను విమానంలో గౌహతికి తరలిస్తున్నట్లు మహారాష్ట్రకు చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఆయన PTIతో మాట్లాడుతూ.. ‘‘ మేము భద్రతా కారణాల దృష్ట్యా ఎమ్మెల్యేలను గౌహతికి తరలిస్తున్నాం. సూరత్ ముంబైకి చాలా దగ్గరగా ఉండటం వల్ల కోపంతో ఉన్న సేన కార్యకర్తల నుంచి కొంత ఇబ్బందులు ఎదురుకావచ్చు ’’ అని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర శాసనసభలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా అధికార కూటమి నుండి క్రాస్ ఓటింగ్, మద్దతు వల్ల బీజేపీ ఐదో ఎమ్మెల్సీ సీటు ను గెలుచుకుంది. దీంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఒక్కసారిగా బయటపడింది. ఈ పరిణామం తరువాత వెంటనే ఏక్ నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలను తీసుకొని సోమవారం అర్థరాత్రి సమయంలో సూరత్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేలలో కొందరు స్వతంత్రులు ఉండగా.. మరి కొందరు చిన్న పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు.
