వీధి కుక్కపై రాళ్లతో విచక్షణారహిత దాడి.. ఎనిమిది మందిపై కేసు నమోదు
యూపీలోని లక్నోలో కొందరు దుండగులు ఓ వీధి కుక్కను దారుణంగా కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి వారించగా.. అతడినే బెదిరించారు. ఆ వ్య్తక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది పై కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.

లక్నో: జంతువులకూ జీవించే హక్కు ఉంటుంది. భూమి మీద మనుషులతోపాటు అవి కూడా ప్రాణులే. కానీ, కొన్నిసార్లు మూగ జీవాలపై కొందరు విరుచుకుపడతారు. ఇష్టారీతిన బాదుతారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కొందరు ఓ వీధి కుక్కను విచక్షణారహితంగా కొట్టారు. రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ ఘటన పై స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని గాలిస్తున్నారు.
లక్నోలో ఆషియానా ఏరియాలోని పక్రి పూల్ వద్ద కొందరు ఓ వీధి కుక్కపై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత టూ వీలర్ పై ఎక్కించుకుని స్పాట్ నుంచి పారిపోయారు.
జర్మన్ షెఫర్డ్ కుక్కున తీసుకుని యజమాని అంకిత్ రావత్ బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. కుక్క అరుపులు విన్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆ కుక్క దారుణంగా ఏడుస్తున్నది. వెళ్లి చూడగా.. అక్కడ ఐదారుగురు ఆ కుక్కను విచక్షణారహితంగా కొడుతున్నారు.
Also Read: నమ్మకం సన్నగిల్లింది..: చైనా దౌత్యవేత్తతో సమావేశంలో అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
తాను మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అక్కడ వారు ఎక్కువ మంది ఉన్నారు. మధ్యలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంకిత్ రావత్‌ను వారు బెదిరించారు.
‘నేను ఒక్కడినే ఉన్నందున.. కెమెరాతో ఆ ఘటనను చిత్రించాను. ఆ తర్వాత కుక్కను కాపాడటానికి 112కు ఫోన్ చేశాను’ అని రావత్ వివరించారు. మున్నా రాజ్‌పుత్, మోహిత్ రాజ్‌పుత్, కరణ్ పండిట్, సన్నీ, సూరజ్, అజయ్, విశాల్, హర్ష్‌లపై రావత్ ఫిర్యాదు చేశాడు. కంటోన్మెంట్ ఏసీపీ అభినయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని వివరించాడు. నిందితులను గాలిస్తున్నామని చెప్పారు.