తమిళనాడులోని కరూర్‌లో మైనర్ బాలికను నిర్బంధించి దాదాపు ఆరు నెలల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలో రోజురోజుకు మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదోక చోట అత్యాచార, హత్య ఘటనలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. కామాంధులు తమ కామావాంఛ తీర్చుకునేందుకు బాలికలు, మహిళలు అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. మహిళల రక్షణ కోసం పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకుని వచ్చినా .. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ తరహా ఘటనలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. చాలామంది పరువు పోతుందని బయటకు రాకుండా ఉండిపోతున్నారు.
తాజాగా తమిళనాడులోని కరూర్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను బంధించి.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఓ మైనర్ బాలికను నిర్భందించి.. లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో, బాలల సంరక్షణ అధికారులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కరూర్ ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐదుగురు యువకులతోపాటు బ్రోకర్లుగా పనిచేస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతి (42), మేఘల (42), మాయ (45)లు బ్రోకర్లుగా వ్యవహరించగా, కార్తీ (28), కార్తికేయన్ (27), సంతోష్ (30), సముద్రపాండి (27), గౌతమ్ (30)లు మైనర్‌ను లైంగికంగా వేధించారని పోలీసు వర్గాలు తెలిపాయి. దాదాపు ఆరు నెలల పాటు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, విచారణ ఆధారంగా మొత్తం ఎనిమిది మంది నిందితులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో)కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
