Asianet News TeluguAsianet News Telugu

5వ తేదీలోపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జిషీట్.. ఇంకొందరు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉండే అవకాశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీటును ఈడీ దాఖలు చేయనుంది. ఈ చార్జిషీటులో పలువరు రాజకీయ నేతలు ఉండే అవకాశముందని ఈడీ వర్గాలు వివరించాయి. జనవరి 5వ తేదీలోపు ఈ చార్జిషీటు దాఖలు కానుంది.
 

ED to file another chargesheet in liqour scam by jan 5th
Author
First Published Jan 2, 2023, 5:41 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండో చార్జిషీటును ఈ నెల 5వ తేదీలోపు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయిి. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ సోమవారం ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది. జనవరి 5వ తేదీలోపు లిక్కర్ స్కాం కేసులో సప్టిమెంటరీ చార్జిషీట్ ఫైల్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ చార్జిషీటులో ఇంకొందరు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని ఈడీ వర్గాలు వివరించాయి.

ఫస్ట్ చార్జిషీటులో లిక్కర్ ట్రేడర్ సమీర్ మహేంద్రు పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో నిలిపేసిన ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయని, అందులో మహేంద్రు పాత్ర ఉన్నదనే ఆరోపణలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నది. సమీర మహేంద్రు పై దాఖలు చేసిన చార్జిషీటులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ రెడ్డి సహా పలువురు పేర్లను ఈడీ పేర్కొంది.

Also Read: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా - నిన్ను ఎవ్వరు కాపాడలేరు : కవితకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్

ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిందితుడిగా ఉన్నారు. కానీ, ఆయన పేరును మాత్రం ఈడీ ఇప్పటి వరకు చార్జిషీటులో పేర్కొనలేదు. ఇదే కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా మనీష్ సిసోడియా పేరును పేర్కొనకపోవడం గమనార్హం. అయితే, మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా దర్యాప్తు జరుగుతున్నదని మాత్రం సీబీఐ చెబుతున్నది.

ఈ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరెస్టు అయిన నిందితులు అందరినీ ఈ నెల 7వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. వీరి రిమాండ్‌ను తాజాగా న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లిలకు గతంలో కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పెంచాలని కోరుతూ సీబీఐ  కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios