బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ తనిఖీలు చేపడుతున్నది. తేజస్వీ యాదవ్‌తోపాటు లాలు యాదవ్ కూతుళ్లు, ఆయన సన్నిహిత అనుచరుల నివాసాల్లోనూ రైడ్లు చేస్తున్నది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో సీబీఐ లాలు దంపతులను ప్రశ్నించిన తర్వాత ఈడీ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
న్యూఢిల్లీ: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఈ రోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ ఇంటిలో తనిఖీలు ప్రారంభించింది. లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ నివాసంతోపాటు ఆయన కూతుళ్లు రాగిని యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్‌ల ఇళ్లపైనా తనిఖీలు చేసింది. ఆర్జేడీ మాజీ పాట్నాలోని ఎమ్మెల్యే అబు దొజానా నివాసంలోనూ రైడ్లు చేపట్టింది. బిహార్, ఢిల్లీ, జార్ఖండ్, ముంబయిలలోని సుమారు 15 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేసింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్‌కు చెందిన గజియాబాద్‌లోని ఇల్లు కూడా ఉన్నది. జితేంద్ర యాదవ్.. లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రాగిని భర్త.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కామ్‌లో భాగంగా ఈడీ దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నది. లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న ప్రాంతాలు, ఆస్తులపై రైడ్లు చేపట్టింది.
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో సీబీఐ బిహార్ మాజీ సీఎంలు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలను ప్రశ్నించిన తర్వాత ఈ తనిఖీలు జరగడం గమనార్హం. మార్చి 7వ తేదీన కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ ఐదు గంటలపాటు ప్రశ్నించింది. ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత ఢిల్లీలోని మీసా భారతి నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. సీబీఐ ఆ ఇంటికి వెళ్లి ప్రశ్నలు వేసింది. అంతకు ముందటి రోజు పాట్నాలోని నివాసంలో లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించింది.
రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం కొందరి నుంచి భూమిని లంచంగా పొందారనే ఆరోపణలతో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో లాలు యాదవ్ కుటుంబ సభ్యులు, ఇతర నేతలతోపాటు ఈ ఉద్యోగం పొందారనే ఆరోపణలతో 12 మంది పై కేసు ఫైల్ అయింది.
ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విపక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇటీవలే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో లాలు ప్రసాద్ యాదవ్‌నూ దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపించారు.
