Asianet News TeluguAsianet News Telugu

శివసేన ఎంపీ సంంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదివారం ఉదయం ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి  వచ్చిన ఈడీ అధికారులు.. పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సోదాలు, విచారణలు చేపట్టారు.

ED officials conduct searches at the residence of Shiv Sena MP Sanjay Raut
Author
First Published Jul 31, 2022, 9:12 AM IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదివారం ఉదయం ముంబైలోని సంజయ్ రౌత్ నివాసానికి  వచ్చిన ఈడీ అధికారులు.. పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సోదాలు, విచారణలు చేపట్టారు. అయితే తన నివాసంలో ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ స్పందించారు. ‘‘మహారాష్ట్ర, శివసేన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాయి.. ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు చర్య.. తప్పుడు సాక్ష్యం.. నేను శివసేనను వీడను.. నేను చనిపోయినా లొంగిపోను.. జై మహారాష్ట్ర. నాకు ఎలాంటి స్కామ్‌తో సంబంధం లేదు. బాలాసాహెబ్ మనకు పోరాడడం నేర్పించారు.. నేను శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

ఇక, ఈడీ సోదాల నేపథ్యంలో.. సంజయ్ రౌత్ ఇంటి వద్దకు భారీగా శివసేన కార్యకర్తలు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. మరోవైపు ఈడీ అధికారులు సంజయ్ రౌత్ నివాసానికి వచ్చిన సమయంలో సీఆర్‌పీఎఫ్ అధికారులను వెంట తీసుకొని వచ్చారు. 

అయితే పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై 'చాల్' రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, సంజయ్ రౌత్ భార్య, అతని సహచరులకు సంబంధిత లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్‌ను ఈడీ విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, మరో ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

జూలై 1న రాజ్యసభ ఎంపీని సుమారు 10 గంటల పాటు ప్రశ్నించగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు సంజయ్ రౌత్ రెండు సార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఇందులో తాజాగా జూలై 27న జారీ చేసిన సమన్లు కూడా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేదని సంజయ్ రౌత్ చెబుతున్నారు.  

అయితే శివసేనకు వ్యతిరేకంగా ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈడీ చేత ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా తాము ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి నడుస్తానని చెబుతున్నారు. మరోవైపు సంజయ్ రౌత్ ఈడీ విచారణకు హాజరుకాకపోవడంపై బీజేపీ నేతు ఎదురుదాడి చేస్తున్నారు. ‘‘అతడు ఏ తప్పు చేయకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎందుకు భయపడుతున్నాడు? అతనికి విలేకరుల సమావేశాలు నిర్వహించడానికి సమయం ఉంది.. కానీ విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి సమయం లేదు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios