Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. మరొకరిని అరెస్ట్ చేసిన అధికారులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. 

ED arrest Rajesh Joshi in Delhi liquor scam
Author
First Published Feb 9, 2023, 10:37 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు..  అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ రాజేష్ జోషిని అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని సెక్షన్ల కింద జోషిని అరెస్టు చేశామని.. గత ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం 'కిక్‌బ్యాక్' మళ్లింపుకు సంబంధించి అతని సంబంధాలు తమ స్కానర్ కింద ఉన్నాయని అధికారులు తెలిపారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో వచ్చిన రూ. 100 కోట్ల ‘‘కిక్‌బ్యాక్‌’’లో కొంత భాగాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారని కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇటీవలే పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని ఒయాసిస్ గ్రూపుతో సంబంధం ఉన్న మల్హోత్రాను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన అధికారులు.. అతను విచారణకు సహకరించకపోవడం, ప్రశ్నలను దాటవేయడంతో మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వద్ద గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేశారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని  కోరారు. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నుంచి మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక, ఇప్పటి వరకు ఈడీ ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. తాజాగా రాజేష్ జోషిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో అరెస్ట్ చేసినవారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios