మేఘాలయ రాజధానిలో భూకంపం..
Meghalaya Earthquake : మేఘాలయలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.8గా నమోదు అయ్యింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదు.
Meghalaya Earthquake : మేఘాలయ రాజధాని షిల్లాంగ్, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 3.8గా నమోదు అయ్యింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు చెప్పారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపింది.
నేటి ఉదయం 8.46 గంటలకు ఒక్క సారిగా షిల్లాంగ్, దాని చుట్టపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని ప్రాంతీయ భూకంప కేంద్రం అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు వెల్లడించారు. నగరానికి నైరుతి దిశలోని మావ్ ఫలాంగ్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కాగా..ఈశాన్య రాష్ట్రాలు అధిక భూకంప జోన్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. దక్షిణ భారతదేశంలో కూడా నేటి ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. తమిళనాడులోని చెంగల్పట్టులో శుక్రవారం ఉదయం 7.30గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమికి పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది. కాగా.. ఇప్పటికే మిచౌంగ్ తుపాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ప్రజలు ఈ ప్రకంపనల వల్ల ఆందోళనకు గురయ్యారు.