ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రత నమోదు..
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం వచ్చింది. ఆదివారం 6.3 తీవ్రతతో హెరాత్ కు 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 8 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం వల్ల ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు.

ఇప్పటికే వరుస భూకంపాలతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆదివారం హెరాత్ కు 34 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత 6.3గా ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8 గంటల తరువాత మొదటి భూకంపం సంభవించడంతో పాటు, మరో రెండు సార్లు 5.4, 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జీఎస్ పేర్కొంది.
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో పేలిన మందుపాతర.. ఆర్మీ జవాన్ కు గాయాలు
ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు 93 మంది గాయపడ్డారు. అయితే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన సంభవించిన వరుస భూకంపాలు హెరాత్ లోని మొత్తం గ్రామాలను నేలమట్టం చేశాయి. ఇది దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత వినాశకరమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది.
వారం క్రితం మరణించిన వారిలో 90 శాతానికి పైగా మహిళలు, పిల్లలేనని ఐక్యరాజ్యసమితి అధికారులు గురువారం నివేదించారు. అంతకుముందు సంభవించిన భూకంపాల వల్ల ప్రావిన్స్ వ్యాప్తంగా 2,000 మందికి పైగా మరణించారని తాలిబన్ అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. జెండా జాన్ జిల్లాలో భూకంప కేంద్రం ఉంది. ఇక్కడ 1,294 మంది మరణించారు, 1,688 మంది గాయపడ్డారు, అనేక ఇళ్లు కుప్పకూలాయి.
కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్.. 274 మందితో ఢిల్లీకి చేరుకున్న నాలుగో విమానం..
అక్టోబర్ 11న సంభవించిన భూకంపం, పలు ప్రకంపనలు, 6.3 తీవ్రతతో సంభవించిన రెండో భూకంపం గ్రామాలను నేలమట్టం చేశాయి. ఈ ప్రకంపనల వల్ల పాఠశాలలు, హెల్త్ క్లినిక్లు, ఇతర గ్రామ సౌకర్యాలు కూడా కుప్పకూలాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ కు సాయం చేయాలని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రాయన్ ఇటీవల ప్రపంచ దేశాలను కోరారు. కష్టాల్లో ఉన్న తమను సంపన్న దేశాలు ఆదుకోవాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా.. జూన్ 2022 లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని కఠినమైన, పర్వత ప్రాంతంలో ఇలాంటి పెద్ద భూకంపమే సంభవించింది. దీని తీవ్రత వల్ల రాళ్లు, మట్టి-ఇటుక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ సమయంలో సుమారు 1000 మంది మరణించగా.. మరో 1500 మంది గాయాల పాలయ్యారు.