కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్.. 274 మందితో ఢిల్లీకి చేరుకున్న నాలుగో విమానం..
ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ అజయ్’ కొనసాగుతోంది. తాజాగా నాలుగో విమానం టెల్ అవీవ్ నుంచి బయలుదేరి నేటి ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 274 మంది భారతీయులు ఉన్నారు.
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభం వల్ల అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో మన దేశ పౌరులు కూడా ఉన్నారు. వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆపరేషన్ అజయ్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మూడు విమానాలు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరి భారత్ కు చేరుకున్నాయి. తాజాగా నాలుగో విమానం కూడా టెల్ అవీవ్ నుంచి బయలుదేరి భారత్ చేరకుంది.
274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ రాజధాని నుంచి బయలుదేరిన ఈ నాలుగో విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. వారికి విమానాశ్రయంలో సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ పౌరులకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇజ్రాయెల్ లో ఉన్న 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 'ఆపరేషన్ అజయ్'కు శ్రీకారం చుట్టారు. దీని కోసం నమోదు చేసుకునే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. హమాస్ ఉగ్రవాదుల అలలు సరిహద్దును దాటడంతో 1,300 మందికి పైగా ఇజ్రాయెలీలు మరణించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ కంపెనీలకు సహాయం అందిస్తోంది. సహాయం అవసరమైన భారతీయ పౌరుల కోసం హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఘర్షణల తీవ్రత దృష్ట్యా ఎంఈఏ 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి, సమాచారం, సహాయాన్ని అందించడానికి కంట్రోల్ రూమ్ సాయపడుతోంది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ లో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో 2,200 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ లో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.