ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో పరుగులు (వీడియో)
కేరళ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఫారెస్ట్ ఏరియాలో ఏనుగు దాడి నుండి ఇద్దరు వ్యక్తులు ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు.
న్యూఢిల్లీ: కేరళ -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని వాయనాడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగు దాడి నుండి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డాడు. ఇద్దరు వ్యక్తులను ఏనుగు తరుముతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఏనుగు నుండి తప్పించుకొనే క్రమంలో ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు.ఏనుగు దాడి నుండి ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వాయనాడ్-మైసూర్ అటవీ రహదారిపై ఉన్న బందీపూర్ నేషనల్ పార్క్ స్ట్రెచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాళ్లప్పుజాకు చెందిన సవాద్ అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పర్యాటకులు కర్ణాటక నుండి బందీపూర్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా కేరళకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అటుగా వెళ్తున్న ఏనుగు ఫోటో తీయడానికి కారులో వెళ్తున్న ఇద్దరు ప్రయత్నించారు. ఇందు కోసం రోడ్డుపైనే కారును నిలిపివేశారు. ఈ విషయాన్ని గమనించిన ఏనుగు ఈ ఇద్దరిని వెంటాడింది. ఏనుగు ఫోటో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. కారులో ఉన్న వారు వెంటనే కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపించారు. ఏనుగు వెంబడించడంతో ఓ వ్యక్తి రోడ్డుపై కిందపడిపోయాడు. అయితే ఆ వ్యక్తిపై ఏనుగు దాడికి ప్రయత్నించింది. అయితే అతను తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.
also read:కావడిలో అయోధ్యకు: పేరేంట్స్ ను మోసుకెళ్తున్న కొడుకు
ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో వాహనాలు ఆపడం లేదా వాహనాల తలుపులు తెరవడంపై ఆంక్షలున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో వన్యమృగాలు ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఈ కారణంగానే ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అయితే అధికారుల సూచనలను చాలా మంది పెడచెవిన పెడుతున్నారు.ఈ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.వన్యప్రాణుల దాడులకు గురికావడమో, లేదా అటవీ జంతువులకు ఇబ్బంది కల్గిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.