కరోనా మహమ్మారి కారణంగా జాతీయ పార్టీలకు గతంలో కంటే చాలా తక్కువగా విరాళాలు వచ్చాయి. 2019-20 సంవత్సరంతో పోలిస్తే తాజాగా (2020-21)లో మొత్తం విరాళాలు 41.49 శాతం తగ్గాయి. ఇందులో బీజేపీకి రూ. 477.54 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 74.524 కోట్లు విరాళాలు వచ్చాయి. 

న్యూఢిల్లీ: కొవిడ్ దెబ్బతో రాజకీయ పార్టీలకు విరాళాలు కూడా తగ్గిపోయాయి. 2020-21 కాలంలో 41.49 శాతం మేరకు ఈ విరాళాలు పడిపోయినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అంటే... 420 కోట్ల విరాళాలు తగ్గిపోయాయని తెలిపింది. విరాళాలు తగ్గడానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి అయి ఉంటుందని వివరించింది. 2020 మార్చి చివరలో తొలి కరోనా వేవ్ మొదలైందని గుర్తు చేసింది. 

మొత్తం విరాళాల్లో 41.49 శాతం తగ్గుదల ఉండగా.. ఈ స్థాయిలోనే జాతీయ పార్టీలకు విరాళాల్లో తగ్గుదల కనిపించింది. మరీ ముఖ్యంగా బీజేపీలో ఈ తగ్గుదల కొట్టొచ్చినట్టు కనిపించింది. 2019-20 కాలంలో బీజేపీకి 784.77 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ, 2020-21 కాలంలో ఈ విరాళాాలు 477.54 కోట్లకు పడిపోయాయి. అంటే.. 39.23 శాతం విరాళాలు ఈ పార్టీకి తగ్గిపోయాయి. అదే.. 2018-19లో వచ్చిన విరాళాలను 2019-20లతో పోల్చితే 5.88 శాతం అధికంగా వచ్చాయి. కానీ, ఈ ఏడాదే పెరుగదల కాదు కదా... 39.23 శాతం తగ్గాయి.

అలాగే కాంగ్రెస్ విరాళాలు చూద్దాం. 2019-20లో కాంగ్రెస్‌కు 139.016 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ, ఈ సారి అంటే 2020-21లో ఈ విరాళాలు దారుణంగా తగ్గి రూ. 74.524 కోట్లకు పడిపోయాయి. అంటే.. బీజేపీ విరాళాల్లో తగ్గుదల 39.23 శాతం ఉంటే.. కాంగ్రెస్ విరాళాల్లో 46.39 శాతం తగ్గుదల ఉన్నది. అంతకు క్రితం ఏడాది అంటే 2019-18 కాలం కంటే 2019-20లలో 6.44 శాతం తగ్గాయి. ఈ సారి మరీ దారుణంగా 46.39 శాతం తగ్గాయి.

కాగా, ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు మొత్తంగా సుమారు 246 కోట్ల విరాళాలు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి రూ. 71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ. 47 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇదిలా ఉండగా, రూ. 37.912 కోట్ల విరాళాలు ఏ రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించకుండా ఉన్నాయి. ఎందుకంటే.. సరైన వివరాలు పొందుపరచలేదు. 

మొత్తం విరాళాల్లో కార్పొరేట్, వ్యాపార రంగం 1,398 డొనేషన్లు జాతీయ పార్టీలకు చేశాయి. ఈ డొనేషన్ల ద్వారా రూ. 480.655 కోట్లు విరళాలలు ఇచ్చాయి. అంటే.. మొత్తం డొనేషన్లలో 80 శాతం వీటి నుంచే వచ్చినట్టు అర్థం అవుతున్నది. కాగా, 2,258 మంది వ్యక్తులు రూ. 111.6 కోట్లు లేదా మొత్తం విరాళాల్లో 18.804 శాతం డొనేషన్లు ఇచ్చారు.