వీడి దుంపతెగ.. తాగినమత్తులో తన పెళ్లి సంగతే మర్చిపోయాడు.. మండపానికే వెళ్లలేదు.. ఆ వధువు ఏం చేసిందంటే...
ఓ వ్యక్తి తాగిన మత్తులో తన పెళ్లి ఉందని.. పెళ్లి కొడుకును తనే అన్న సంగతి మర్చిపోయాడు. దీంతో వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది.
బీహార్ : మద్యం మత్తులో తన పెళ్లి అన్న సంగతే మర్చిపోయాడు ఓ వరుడు. ముహూర్త సమయానికి మండపానికి వెళ్లలేదు. మద్యం తాగుతూ కూర్చుని ఆలస్యంగా వెళ్ళాడు. వరుడు కోసం మండపంలో ఎంతోసేపు ఎదురుచూసిన వధువు.. మద్యంమత్తులో వచ్చిన వరుడుని చూసి పెళ్లినే రద్దు చేసేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి.. సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు మంగళవారం ఉదయం పెళ్లి ముహూర్తం ఉంది. పెళ్లి పనులన్నీ చక చకా జరిగిపోయాయి. అనుకున్న రోజు రానే వచ్చింది.
వధువు ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుని పూజా కార్యక్రమాలు పూర్తి చేసి వరుడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.. బంధువులు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో పెళ్లి మండపానికి చేరుకున్నారు. వీరంతా కలిసి వరుడి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ముహూర్త సమయం దాటినా... పెళ్ళికొడుకు ఇంకా రాలేదు. దీంతో వధువు కుటుంబం ఆందోళన చెందింది. వరుడు పెళ్లి ముహూర్తం దాటిపోయిన తర్వాత మధ్యాహ్నానికి మద్యం మత్తులో తూలుతూ మండపానికి వచ్చాడు. అది చూసిన వధువు షాక్ అయింది. జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజైన పెళ్లినాడే ఇలా చేసే... అలాంటి వాడితో జీవితాంతం ఎలా ప్రయాణం సాగించాలనుకుందో ఏమో కానీ.. వెంటనే తనకు ఈ పెళ్లి వద్దంటూ రద్దు చేసింది.
కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. మద్యం మత్తులో కారును ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్
ఇదిలా ఉండగా.. ఇలాంటి ఘటనే మూడు రోజుల క్రితం అస్సాంలో వెలుగు చూసింది. అస్సాంలోని నల్బరీ జిల్లా బర్ఖానాజన్ ప్రాంతానికి చెందిన యువతికి, ప్రసేన్ జిత్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. కాగా ఆ వరుడు పెళ్లి మండపానికి పీకలదాకా మద్యం సేవించి రావడమే కాకుండా.. పెళ్లి తంతు నిర్వహించడానికి ఆ మత్తులో గమ్మత్తుగా కష్టపడడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అందులో వరుడు స్వయంగా తంతు నిర్వహించలేకపోతుండడంతో.. వరుడు బంధువు అతని వెనుక మద్దతుగా కూర్చుని చేపిస్తున్నాడు. వరుడే కాదు.. కొడుకు అలా చేస్తుంటే వారించాల్సిన వరుడి తండ్రి కూడా మద్యంమత్తులోనే ఉన్నాడు. అతను కూడా కంట్రోల్ లేని పరిస్థితిలోనే ఉన్నాడు.
వీటన్నింటిని చూసిన వధువు.. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనుకుందో ఏమో… మొత్తానికి ఆ పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. వధువు నిర్ణయానికి గ్రామ పెద్దలు, స్థానికులు మద్దతు పలికారు. వారు చెప్పిన దాని ప్రకారం.. ‘వరుడే కాదు.. వరుడు తండ్రి కూడా మద్యంమత్తులో తూలుతున్నాడు. కారులో నుంచి దిగే పరిస్థితిలో కూడా లేడు. ఇది వధువు స్వయంగా చూసింది’ అందుకే ఆమె పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుంది అని ఆమె బంధువు ఒకరు తెలిపారు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత వరుడు అతని కుటుంబ సభ్యుల మీద వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.