భారత 15వ రాష్ట్రపతిగా ఈ రోజు ఉదయం ద్రౌపది ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 10.15 గంటలకు ఆమె ప్రమాణం మొదలవ్వగా.. 10.23 గంటలకు ఆమె దేశ 15వ రాష్ట్రపతిగా దేశ ప్రజలను ఉద్దేశించి పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి తొలి ప్రసంగం చేస్తారు.
న్యూఢిల్లీ: భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమా శంకర్ దీక్షిత్ లేన్‌లోని తన తాత్కాలిక నివాసం నుంచి ద్రౌపది ముర్ము రాజ్‌ఘాట్‌కు ఉదయం 8.15 గంటలకు బయల్దేరుతారు. 8.30 గంటలకు రాజ్‌ఘాట్ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌కు 9.22 గంటల సమయానికి ఆమె చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఆమె వెంటే ఉండి సెంట్రల్ హాల్‌కు తీసుకెళ్లతారు. ద్రౌపది ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాల్ చేరగానే అక్కడ జాతీయ గీతం పాడతారు.
ఉదయం 10.15 గంటలకు ప్రమాణ స్వీకారం మొదలు అవుతుంది. సీజేఐ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. ఆమె ప్రమాణం తీసుకున్న తర్వాత ఓత్ రిజిస్టర్‌లో సంతకం పెడతారు.
ఉదయం 10.23 గంటలకు ఆమె దేశ 15వ రాష్ట్రపతిగా దేశ ప్రజలను ఉద్దేశించి పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి తొలి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ఉదయం 10.57 గంటలకు ఆమె రాష్ట్రపతి భవన్‌కు ఊరేగింపుగా వస్తారు. రాష్ట్రపతి భవన్ ముందు వేడుకలు జరుగుతాయి. వర్షం పడితే ఈ వేడుకలు జరగకపోవచ్చు.
ద్రౌపది ముర్ము తొలి గిరిజిన రాష్ట్రపతిగా రికార్డులకు ఎక్కుతున్నారు. భారత్ స్వాతంత్రం పొందిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమె. అంతేకాదు, పిన్న వయసులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగానూ ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. భారత ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన రెండో మహిళ ద్రౌపది ముర్ము.
