మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  సింగ్ పూర్ రైల్వేస్టేషన్ లో రెండు గూడ్స్  రైళ్లు ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో   రెండు రైల్ ఇంజన్లకు మంటలు అంటుకున్నాయి.  

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్ పూర్ రైల్వేస్టేషన్ వద్ద రెండు గూడ్స్ రైళ్లు బుధవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రైలు డ్రైవర్ మృతి చెందాడు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో రెండు రైల్ ఇంజన్లకు మంటలు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంతో బిలాస్ పూర్-కట్నీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిలాస్ పూర్ నుండి కట్నీ రైల్వే మార్గంలో షాడోల్ కు 10 కి.మీ. ముందు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఇవాళ ఉదయం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని బిలాస్ పూర్ -కట్నీ సెక్షన్ లోని సింగ్ పూర్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహయక చర్యలు సాగుతున్నాయని అధికారులు ప్రకటించారు. ఒకే ట్రాక్ పై రెండు గూడ్స్ రైళ్లు వచ్చాయి. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎలా వచ్చాయనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించినట్టుగా రైల్వేశాఖ ప్రకటించింది. 

ఈ ప్రమాదంతో ఈ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. వెయ్యి మంది ప్రయాణీకులను బస్సుల్లో తమ గమ్యస్థానాలకు తరలించారు. రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న గూడ్స్ ను రైలును మరో గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న రైలు పైలెట్ మృతి చెందాడు. మృతి చెందిన లోకో పైలెట్ ను 51 ఏళ్ల రాజేష్ గా గుర్తించారు. 

అన్ని ప్రధాన స్టేషన్లలో డిస్ ్ప్లే బోర్డులు, అనౌన్స్ మెంట్ల ద్వారా రైళ్ల రాకపోకల సమాచారం వివరించనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. బిలాస్ పూర్ , షెండ్రారోడ్ అనుప్పూర్, షాహ్ దోల్ వంటి ప్రధాన స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.