భక్తులారా... రామమందిర ప్రారంభోత్సవానికి రాకండి..: అయోధ్య ఆలయ ట్రస్ట్ కార్యదర్శి సంచలనం
వచ్చే నెల జనవరి 22న అయోధ్య రామమందిరాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం భక్తులు అయోధ్యకు రావద్దంటూ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అయోధ్య : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన దివ్యమైన మందిరం ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో భారీ రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. యావత్ భారత ప్రజల సహకారంతో అద్భుత శిల్పకలా సంపదతో రామాలయాన్ని నిర్మించారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రాములోరి ఆలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. కొత్త సంవత్సరం 2024 ఆరంభంలోనే అంటే జనవరి 22న ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభంకాగా దేశ నలుమూలల నుండి భక్తులు ఆయోధ్యకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆలయ ట్రస్ట్ సెక్రటరీ రామాలయ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
అయోధ్యలో కేవలం రాములోరి గర్భగుడి నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని రామమందిర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. గర్భగుడి మినహా మిగతా ఆలయ పనులు ఇంకా అసంపూర్తిగా వున్నాయని... ఇవి పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందన్నారు. చాలా నిర్మాణ పనులు ఇంకా పూర్తికావాల్సి వుందని... ఇందుకు సమయం పడుతుందని రాయ్ తెలిపారు.
ఈ క్రమంలోనే వచ్చేనెల (జనవరి) 22న జరిగే అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసేందుకు సిద్దమైన భక్తులకు రాయ్ ఓ సూచన చేసారు. అయోధ్యకు రావడం కంటే తమ సమీపంలోని ఆలయాల్లోనే 'ఆనంద మహోత్సవం' జరుపుకోవాలని సూచించారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగి గందరగోళ పరిస్థితులు ఏర్పడకూడదనే ఈ పిలుపు ఇస్తున్నట్లు రాయ్ వెల్లడించారు.
Also Read ayodhya airport : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? విమానాలు ఇవే...
ఇదిలావుంటే అయోధ్య రామమందిరాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు వారంరోజుల ముందే ప్రారంభంకానున్నాయి. జనవరి 16 నుండి వారణాసికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో రామమందిరంలో పూజలు ప్రారంభంకానున్నాయి. వారంరోజుల పాటు నిర్విరామంగా పూజలు చేసి రాముడి విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.
రామమందిర నిర్మాణమే కాదు ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలిరానున్నారు. ఇందుకు తగినట్లుగా ఆలయ ట్రస్ట్, యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తుల వసతి కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రారంభోత్సవం కోసం వచ్చే ప్రధాని, ఇతర ప్రముఖుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.