లోక్ సభ ఎన్నికల వరకైనా గవర్నర్‌గా ఆయననే ఉంచండి: కేంద్రానికి స్టాలిన్ వ్యంగ్యం లేఖ
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కనీసం వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకైనా గవర్నర్‌గా ఆర్ఎన్ రవినే కొనసాగించాలని వ్యంగ్య లేఖ రాశారు. ఆయన వల్లించే అబద్ధాలు, ద్రావిడం అంటే ఏమిటీ అనే రెచ్చగొట్టే ప్రశ్నలు అడగడం మూలంగా అంతిమంగా ఎన్నికల్లో తమకే లబ్ది చేకూరుతుందని వివరించారు.
చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల వరకైనా సరే గవర్నర్‌గా ఆర్ఎన్ రవినే ఉంచాలని వ్యంగ్యంగా రాశారు. ద్రవిడం అంటే ఏమిటీ అని అడిగిన ఆర్ఎన్ రవి గవర్నర్‌గా కొనసాగడం వల్ల తమకు ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందని వివరించారు. ఆయన వల్లించే అబద్ధాలు అంతిమంగా తమకు ప్రయోజనాలు చేకూరుస్తాయని తెలిపారు. రాజ్ భవన్ పై పెట్రోల్ బాంబ్ దాడి జరిగిన మరుసటి రోజు ఎంకే స్టాలిన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
‘గత రెండు రోజులుగా ఆయన ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తూ, ద్రవిడం ఏమిటీ అని అడిగుతున్న వ్యక్తి తప్పకుండా ఇక్కడే కొనసాగాలనేది నా అభిప్రాయం. అది కచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. కనీసం పార్లమెంటు ఎన్నికల వరకైనా ఆయనను మార్చవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి, హోం మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని స్టాలిన్ వివరించారు.
Also Read: రెండో పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి.. ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం ఆదేశాలు
కాగా, పెట్రోల్ బాంబు ఘటనపై రాజ్ భవన్ సీరియస్ అయింది. పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేయలేదని, ఒక అల్లరి చేష్టగా గుర్తించి ఈ దాడి ఘటన తీవ్రతను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాజ్ భవన్ గురువారం పేర్కొంది. ఈ ఘటనలో దర్యాప్తు ప్రారంభం కాకముందే ముగించారని తెలిపింది.
ఈ ఘటనను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.