అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై రియాక్ట్ అవుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ తో యూఎస్ స్నేహంపై చురకలు అంటించారు. 

Donald Trump - Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో వేడుకలు జరిగాయి… స్వయంగా ట్రంప్ ఇందులో పాల్గొన్నారు. దీపాలను వెలిగించిన ట్రంప్ భారతీయ, అమెరికన్ సమాజంతో కలిసి పండుగ జరుపుకున్నారు. 

పండగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసిన ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీని గొప్ప వ్యక్తిగా, మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. ఫోన్ కాల్‌లో వాణిజ్యం, ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. పీఎం మోదీ కూడా అధ్యక్షుడు ట్రంప్‌కు దీపావళి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.

ట్రంప్ కు మోదీ చురకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ గురించి పీఎం మోదీ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఎక్స్ (X)లో… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు. "దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ఫోన్ చేసిన అధ్యక్షుడు ట్రంప్ ధన్యవాదాలు. ఈ వెలుగుల పండుగనాడు మన రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి ఆశాకిరణంగా నిలవాలని… అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ఐక్యంగా నిలబడాలి" అని కోరుకుంటున్నానంటూ ప్రధాని పోస్ట్ పెట్టారు. ఇలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్ తో అమెరికా స్నేహం చేయడంపై పరోక్షంగా స్పందిస్తూ ట్రంప్ కు చురకలు అంటించారు మోదీ. 

Scroll to load tweet…

ఈ అంశాలపైనే మోదీ-ట్రంప్ చర్చ

 అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ఒక ప్రకటనలో.. "నేను భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. మా సంభాషణ చాలా బాగా జరిగింది. మేము వాణిజ్యం, అనేక ఇతర అంశాలపై చర్చించాము… ప్రధానంగా వాణిజ్య సంబంధిత విషయాల గురించే మాట్లాడాము." అని అన్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్ ను శత్రువుగా చూస్తోంది అమెరికా… ఈ క్రమంలో ట్రంప్-మోదీ ఫోన్ కాల్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.