ఉగ్రవాదులకు వేదిక ఇవ్వొద్దు : కెనడాతో ఉద్రిక్తతల వేళ టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక
కెనడాతో ప్రస్తుతం దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం మానుకోవాలని కేంద్రం గురువారం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లకు సలహా ఇచ్చింది.

ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం మానుకోవాలని కేంద్రం గురువారం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లకు సలహా ఇచ్చింది. సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశం పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన బహిరంగ ఆరోపణలపై ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు వున్న తరుణంలో వేర్పాటువాద నేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక టెలివిజన్ ఛానెల్‌లో కనిపించాడు. అయితే కేంద్రం జారీ చేసిన అడ్వైజరీలో పన్నూ , కెనడా పేరులను కేంద్రం ప్రస్తావించలేదు.
భారతదేశంలో చట్టం ద్వారా నిషేధించబడిన సంస్థకు చెందిన ఉగ్రవాదంతో సహా తీవ్రమైన కేసులు ఉన్న విదేశంలోని వ్యక్తిని టెలివిజన్ ఛానెల్‌లో చర్చకు ఆహ్వానించినట్లు ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. పైన పేర్కొన్న వ్యక్తి దేశ సార్వభౌమత్వం/సమగ్రత, భారతదేశ భద్రత, విదేశంతో ఇండియా స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే అనేక వ్యాఖ్యలు చేసాడు. దేశంలోని పబ్లిక్ ఆర్డర్‌కు కూడా భంగం కలిగించే అవకాశం ఉందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో పేర్కొంది.
ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను సమర్థిస్తూనే, రాజ్యాంగం ప్రకారం దాని హక్కులను గౌరవిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. టీవీ ఛానెల్‌లు ప్రసారం చేసే కంటెంట్ సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2)తో సహా సీటీఎన్ చట్టం, 1995లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి అని అడ్వైజరీలో పేర్కొంది. పై కారణాల దృష్ట్యా, టెలివిజన్ ఛానెల్‌లు తీవ్రమైన నేరాలు/ఉగ్రవాదం , సంబంధిత సంస్థలకు చెందిన వారితో సహా అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తుల గురించి నివేదికలు/ప్రస్తావనలు, వీక్షణలు/ఎజెండాకు ఎలాంటి ప్లాట్‌ఫారమ్‌ను ఇవ్వొద్దని సూచించంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించబడిన , సీటీఎన్ చట్టంలోని సెక్షన్ 20లోని సబ్-సెక్షన్ (2) కింద పేర్కొన్న సహేతుకమైన పరిమితులకు సంబంధించి చట్టం ద్వారా నిషేధించబడిందని అడ్వైజరీ పేర్కొంది.
కాగా.. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్థాయిలో కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించంది. ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.. ఇవాళ కెనడా వాసులకు వీసా జారీ ప్రక్రియను భారత్ నిలిపివేసింది. అలాగే కెనడాలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలంటూ ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేసింది. తాజాగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెనడాపై విరుచుకుపడ్డారు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి. నిజ్జర్ హత్య, తదితర పరిణామాలపై ట్రూడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన స్వర్గధామంగా మారుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు, వ్యవస్థీకృత నేరాల కోసం అంతర్జాతీయ ఖ్యాతి విషయంలో ఆ దేశం ఆందోళన చెందుతోందన్నారు. మరోవైపు.. కెనడాతో దౌత్యపరమైన వివాదంపై భారత్ తన ప్రధాన మిత్రదేశాలకు తన అభిప్రాయాలను తెలియజేసిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాగ్చి అవును అని సమాధానం ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులు, ఇప్పటికే కెనడాలో వున్న విద్యార్ధులు, పౌరులు జాగ్రత్తగా వుండాలని అరిందమ్ బాగ్చి సూచించారు.