'నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దు': సిక్కులకు ఖలిస్తాన్ నేత పన్నూ వార్నింగ్ .. దాడి చేస్తామని సంకేతాలు
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపలుకు దిగారు. నవంబర్ 19న ఎవ్వరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపలుకు దిగారు. నవంబర్ 19న ఎవ్వరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ‘‘ సిక్కులు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని.. నేను సిక్కు సమాజాన్ని కోరుతున్నాను. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిరిండియాను ఆపరేట్ చేయడానికి అనుమతించం. అందుకే నవంబర్ 19 నుంచి సిక్కు ప్రజలెవ్వరూ ఎయిరిండియా విమానాలను ఉపయోగించవద్దు. అది మీ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు’’ అంటూ పన్నూ ముగించారు.
అంతేకాకుండా నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వానికి అతను హెచ్చరికలు పంపాడు. ఈ నవంబర్ 19న ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్‌తో సమానంగా వుంటుందని .. ప్రస్తుతం భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే ప్రపంచకప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజున అహ్మదాబాద్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఆ రోజున సిక్కు సమాజంపై భారతదేశం అణచివేతకు ప్రపంచం సాక్ష్యంగా నిలుస్తుందని గురుపత్వంత్ అన్నాడు. పంజాబ్ స్వాతంత్య్రం పొందిన తర్వాత విమానాశ్రయం పేరును షాహిద్ బియాంత్ సింగ్, షాహిత్ సత్వంత్ సింగ్ ఖలిస్తాన్ విమానాశ్రయంగా మారుస్తామని పన్నూ వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 31, 1984న న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణతో పంజాబ్ స్వాతంత్య్ర పోరాటం ఇప్పటికే ప్రారంభమైందని గురుపత్వంత్ సింగ్ పన్నూ చెప్పాడు. భారత ట్యాంకులు, ఫిరంగిదళాలు దాని సాకారాన్ని నిరోధించలేవని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల తర్వాత భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి పన్నూ హెచ్చరికలు పంపుతున్నాడు.
ప్రస్తుతం కెనడా, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పన్నూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఎఫ్‌జే నుంచి భారత్‌కు తీవ్ర పరిణామాలు వుంటాయని ఆయన పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటికే ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ జరిగిన అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేసినట్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. షహీద్ నిజ్జర్ హత్యకు నిరసనగా మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా, బ్యాలెట్‌ను .. మీ హింసకు వ్యతిరేకంగా ఓటును ఉపయోగించబోతున్నామని గురుపత్వంత్ హెచ్చరించాడు. అది ప్రపంచ క్రికెట్ కప్ కాదు.. ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది కానుందని పన్నూ గతంలో ఓ వీడియో సందేశంలో బెదిరింపులకు పాల్పడ్డాడు.