తమ అమ్మకాలను పెంచుకునేందుకు డోలో టాబ్లెట్స్ తయారీదారులు అక్రమ దందాకు తెరదీసినట్లు ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో బయటపడింది. దాదాపు 1000 కోట్లను డాక్టర్లకు నజరానాగా చెల్లించినట్లుగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఐటీ శాఖ నిర్వహించిన తనిఖీల్లో డోలో టాబ్లెట్స్ తయారీదారుల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. డోలో తయారీదారుల దగ్గర కోట్లాది రూపాయలు వున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అనుమానం వ్యక్తం చేసింది. డోలో టాబ్లెట్లను రోగులకు రాసేందుకు గాను వైద్యులకు భారీ ఎత్తున నజరానాలను ప్రకటించినట్లుగా తేలింది. అనైతిక కార్యక్రమాల ద్వారా డాక్టర్లకు రూ. వెయ్యి కోట్లను చెల్లించినట్లుగా ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. 9 రాష్ట్రాల్లో 36 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. రూ.కోటిన్నర నగదు, కోటిన్నర విలువైన వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. బెంగళూరు కేంద్రంగా డోలో టాబ్లెట్స్ తయారవుతున్నట్లుగా తన కథనంలో పేర్కొంది.
ఇకపోతే.. డోలో 650 అనేది సాధారణంగా జ్వరం తగ్గించే పారసిటమాల్ ఔషధం. అయితే డాక్టర్లు కోవిడ్ సహాయక చికిత్సలో భాగంగా ఎక్కువగా డోలో టాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేశారు. డేటా ప్రకారం, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 2021లో రూ.307 కోట్ల వ్యాపారం చేసింది. అదే సమయంలో ఫార్మా దిగ్గజం GSK ఫార్మాస్యూటికల్స్ కాల్‌పాల్ అనే ఔషధం టర్నోవర్ రూ. 310 కోట్లుగా ఉంది, అలాగే క్రోసిన్ గత ఏడాది రూ. 23.6 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత రెండేళ్లలో డోలో 650 బ్రాండ్ అత్యుత్తమ ఫీవర్ ఔషధానికి పర్యాయపదంగా మారింది. Dolo 650 టాబ్లెట్ జ్వరాన్ని వేగంగా తగ్గించడంతో పాటు ఇది శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించే లక్షణాలు లేవని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం, డోలో మంచి సేఫ్టీ ప్రొఫైల్‌ను కలిగి ఉంది అలాగే ఖరీదు కూడా చాలా తక్కువ.
1973లో చెన్నైలో సురానా స్థాపించిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, డోలో అనే 650 mg పారాసెటమాల్ టాబ్లెట్‌ను తయారు చేస్తుంది, అయితే చాలా ఇతర బ్రాండ్‌లు తమ పారాసెటమాల్ బ్రాండ్‌ను 500 mg టాబ్లెట్‌గా విక్రయిస్తాయి. ఇతర మాత్రల కంటే డోలో 650 మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఇప్పుడు సాధారణ అభిప్రాయం ఉంది. దాదాపు 9,200 మంది ఉద్యోగులతో మైక్రో ల్యాబ్స్ వార్షిక టర్నోవర్ రూ.2,700 కోట్లుగా ఉంది. ఎగుమతులతో ఏటా రూ.920 కోట్లు సమకూరుతోంది. సురానా కుటుంబం నికర విలువ 2 బిలియన్లకు చేరుకుంది.
