బెంగళూరుకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ పై బుధవారం ఆదాయపు పన్ను శాఖ (IT Raids) దాడులు చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాగా ఈ కంపెనీ డోలో-650 టాబ్లెట్లను కూడా తయారు చేస్తుంది. డోలో-650 అనేది గత రెండేళ్లుగా COVID-19 నేపథ్యంలో చాలా వ్యాప్తిలోకి వచ్చిన ఔషధంగా పేరు పొందింది. పారసిటమాల్ 650 ఎంజీ డోసుగా పరిగణించే ఈ టాబ్లెట్ ను జ్వరనివారిణిగా వాడుతున్నారు. 

మైక్రో ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానాపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బుధవారం పలు నగరాల్లో దాడులు నిర్వహించింది. కర్ణాటక, తమిళనాడు, గోవా, పంజాబ్, ముంబై, ఢిల్లీ, సిక్కిం సహా 40 ప్రాంతాల్లో 200 మందికి పైగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

కాగా ఐటీ సోదాల్లో కంపెనీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, బ్యాలెన్స్ షీట్, బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌లను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో కంపెనీకి చెందిన ఇతర నగరాల్లోని ఆఫీసులు, ప్రమోటర్లు, పంపిణీదారులను కార్యాలయాలను కూడా కవర్ చేస్తున్నట్లు తెలిసింది. 

మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఇది ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, APIలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్స్) తయారు చేస్తుంది. విదేశాలలో వ్యాపారం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 17 తయారీ యూనిట్లను కలిగి ఉంది.

కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా సాగిన నేపథ్యంలో విస్తృతంగా వినిపించిన పేరు డోలో 650 mg టాబ్లెట్ , హెల్త్‌కేర్ రీసెర్చ్ సంస్థ IQVIA డేటా ప్రకారం, మార్చి 2020లో కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న సమయంలో ఏకంగా 350 కోట్లకు పైగా డోలో టాబ్లెట్‌లు అమ్ముడయ్యాయని నివేదికలో తేలింది. 

డోల్ 2021లో రూ.307 కోట్ల బిజినెస్ చేసింది
డోలో 650 అనేది సాధారణంగా జ్వరం తగ్గించే పారసిటమాల్ ఔషధం. అయితే డాక్టర్లు కోవిడ్ సహాయక చికిత్సలో భాగంగా ఎక్కువగా డోలో టాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేశారు. డేటా ప్రకారం, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 2021లో రూ.307 కోట్ల వ్యాపారం చేసింది. అదే సమయంలో ఫార్మా దిగ్గజం GSK ఫార్మాస్యూటికల్స్ కాల్‌పాల్ అనే ఔషధం టర్నోవర్ రూ. 310 కోట్లుగా ఉంది, అలాగే క్రోసిన్ గత ఏడాది రూ. 23.6 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత రెండేళ్లలో డోలో 650 బ్రాండ్ అత్యుత్తమ ఫీవర్ ఔషధానికి పర్యాయపదంగా మారింది.

Dolo 650 టాబ్లెట్ జ్వరాన్ని వేగంగా తగ్గించడంతో పాటు ఇది శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించే లక్షణాలు లేవని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం, డోలో మంచి సేఫ్టీ ప్రొఫైల్‌ను కలిగి ఉంది అలాగే ఖరీదు కూడా చాలా తక్కువ. 

వార్షిక టర్నోవర్ రూ.2,700 కోట్లు
1973లో చెన్నైలో సురానా స్థాపించిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, డోలో అనే 650 mg పారాసెటమాల్ టాబ్లెట్‌ను తయారు చేస్తుంది, అయితే చాలా ఇతర బ్రాండ్‌లు తమ పారాసెటమాల్ బ్రాండ్‌ను 500 mg టాబ్లెట్‌గా విక్రయిస్తాయి. ఇతర మాత్రల కంటే డోలో 650 మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఇప్పుడు సాధారణ అభిప్రాయం ఉంది. దాదాపు 9,200 మంది ఉద్యోగులతో మైక్రో ల్యాబ్స్ వార్షిక టర్నోవర్ రూ.2,700 కోట్లుగా ఉంది. ఎగుమతులతో ఏటా రూ.920 కోట్లు సమకూరుతోంది. సురానా కుటుంబం నికర విలువ 2 బిలియన్లకు చేరుకుంది.