ఓ మెడికల్ కాలేజీ క్యాంపస్ లో వీధికుక్క హల్ చల్ చేసింది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్, ఓ అటెండర్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. ఆ తరువాత అక్కడికక్కడే మృతి చెందింది. 

ఉత్తర ప్రదేశ్ : వీధి కుక్కల దాడులు దేశవ్యాప్తంగా ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అలాంటి మరో ఘటన వెలుగు చూసింది. ఓ వీధి కుక్క ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లతో సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గురువారం నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వీధి కుక్కలు విరుచుకుపడుతున్న ఘటనల్లో ఇది కూడా చేరింది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా జరుగుతున్న కుక్కల దాడుల్లో ఇది 16వది. 

రాష్ట్రంలో పెంపుడు కుక్కలు మనుషుల మీద దాడి చేసిన ఘటనలో ఏడు నమోదు అవ్వగా.. వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు తొమ్మిది నమోదయ్యాయి. ఇక ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్ లోని రేడియాలజీ విభాగం బయట ఉన్న వ్యక్తుల మీదుగా అక్కడ ఉన్న వీధి కుక్క ఒకసారిగా దాడికి దిగింది. దీంతో అక్కడే ఉన్న డాక్టర్ సుష్మా యాదవ్, సంజయ్ గుప్తా అనే ఇద్దరు డాక్టర్లు కుక్కకాటుకు గురయ్యారు. 

‘నాకు డిమాండ్ లేదు.. నాది చిన్న పార్టీ’- కౌంటింగ్ కు ముందు జేడీఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

వీరితోపాటు ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, అటెండర్ మీద కూడా వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారని కేజీఎంయూ అధికారులు తెలిపారు. ఇది గమనించిన అక్కడివారు కుక్కను తరిమికొట్టి.. వీరందరినీ హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వారందరికీ వ్యాక్సిన్ వేశామని చెప్పారు. కాగా, గా క్యాంపస్లో కుక్క దాడి ఘటన అనంతరం ఆ కుక్కను బంధించేందుకు యూనివర్సిటీ అధికారులు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ కి సమాచారం అందించారు.

వెంటనే హుటాహుటిన మున్సిపల్ టీం అక్కడికి చేరుకున్నారు. అయితే, మున్సిపాలిటీ టీం వచ్చేలోపే అది చనిపోయిందని తెలిపారు. ఐదుగురు మీద దాడి చేసిన సదరు వీధి కుక్క రేబిస్ తో బాధపడుతుందని అధికారులు తెలిపారు. ఇది దీని ద్వారా వేరే కుక్కలకు కూడా వేగంగా వ్యాపిస్తుందని అన్నారు. రేబిస్ సోకిన వారంలోపు కుక్కలు మృతి చెందుతాయని ఎల్ఎంసి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అభినవ్ వర్మ తెలిపారు.