ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడం, 2024 ఎన్నికలకు ఆయన బ్లూ ప్రింట్ అందించడం వంటి కార్యక్రమాలు నెలల వ్యవధిగా సాగుతున్నది. ఇంతలో టీఆర్ఎస్‌తో పీకే సంస్థ ఐప్యాక్ డీల్ వ్యవహారం కాంగ్రెస్ శ్రేణుల్లో హీటెక్కిస్తున్నది. టీఆర్ఎస్-పీకే డీల్‌ కాంగ్రెస్ అధిష్టానంపై ప్రభావం వేయనుందా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. నిజానికి, టీఆర్ఎస్-ఐప్యాక్(Prashant Kishor I-PAC) డీల్‌ను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తున్నది.

న్యూఢిల్లీ: ఒక వైపు కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్ చర్చలు జరుగుతుండగా.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐప్యాక్‌తో టీఆర్ఎస్ ఒప్పందంపై వార్తలు రావడం చర్చనీయాంశం అయ్యాయి. టీఆర్ఎస్‌కు ఐప్యాక్ సేవలు అందిస్తుందని పీకే చెప్పడంతో ఒక్కసారిగా రాష్ట్ర కాంగ్రెస్‌లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక వైపు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతూ.. ఇక్కడ అధికారపక్షం టీఆర్ఎస్‌తో డీల్ చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ సంకటంలో పడింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానంపై కూడా టీఆర్ఎస్‌తో ఐప్యాక్ డీల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ, కాంగ్రెస్ అధిష్టానంపై దీని నాయకత్వం పెద్దగా ఉండదనేది నిపుణుల అభిప్రాయం. కాంగ్రెస్‌లోకి పీకేను ఆహ్వానించడంపైనా ఎలాంటి ప్రభావం వేయదనీ వారు పేర్కొంటున్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇస్తారనే వార్త గతంలో నానింది. ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చింది. అయితే, అప్పటి నుంచీ ఆయన చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయాలను సోనియా గాంధీ తీసుకుంటున్నారు. పార్టీలోకి తీసుకుంటే.. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక పొజిషన్ క్రియేట్ చేయాలా? లేక ఉన్న వ్యవస్థాగత నిర్మాణంలోనే ఆయన సీటును సర్దుబాటు చేయాలా? అనే చర్చ కూడా జరుగుతున్నది. ప్రశాంత్ కిశోర్ చేరికను స్వాగతిస్తున్న నేతల అభిప్రాయాలను సోనియా గాంధీ ఇప్పుడు యాక్టివ్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. చాలా మంది సీనియర్ నేతలు ఆయన చేరికను స్వాగతిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్‌ నాయకత్వంపై వ్యతిరకతను కలిగి ఉన్న వర్గాలు కూడా కాంగ్రెస్‌ను ప్రక్షాళన గావించాలన్న ఆయన సూచనలను స్వాగతిస్తున్నట్టు తెలిసింది. సమూల మార్పులు చేసి 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన చెప్పిన మాటలను సమర్థించినట్టు కొందరు చెబుతున్నారు.

తాజా పరిణామాల దగ్గరకు వస్తే.. సోనియా గాంధీతో భేటీలోనే ప్రశాంత్ కిశోర్ కొన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌లోకి చేరినప్పటికీ తాను స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ఉనికిలోనే ఉంటుందని ఆయన సోనియాకు చెప్పారు. తాను ఐ‌ప్యాక్‌లో సభ్యుడిగా, అధికారిగా, షేర్‌హోల్డర్‌గా, ప్రమోటర్‌గా లేకున్నా.. అది దాని బాధ్యతలు కొనసాగిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ సక్సెస్ కోసం ఇరువైపులా విశ్వాసంతో, పారదర్శకంగా పని చేయడానికి ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది.

పీకే - కేసీఆర్ భేటీపై కాంగ్రెస్‌లో హైరానా?

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ సమావేశం కావడంపై కాంగ్రెస్ అధిష్టానం హైరానా పడలేదని తెలుస్తున్నది. ఎందుకంటే.. కాంగ్రెస్‌లో పీకే ఇంకా చేరలేదు. అంటే... ఆయన ఏ నేతలతోనైనా స్వేచ్ఛంగా కలిసే, సంప్రదించడానికి ఎలాంటి అవాంతరాలు లేనట్టే. ఆయన కాంగ్రెస్‌లో చేరిన తర్వాతే ఆయనపై ఆ పార్టీ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మరొక విషయం ఆయన ఎన్‌డీఏయేతర పార్టీలతో సమావేశం కావడం, ఎన్‌డీఏ కూటమి పార్టీల జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్‌కు అభ్యంతరం లేనట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే.. ఇప్పటికే ఆయనను అనధికారికంగానైనా ఒక కాంగ్రెస్ మనిషిగానే చూస్తారు. అది కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశం. అంటే భవిష్యత్‌లో ఈ పార్టీలు మళ్లీ ఒక తాటి మీదకు రావడానికి అదీ ముఖ్యంగా కాంగ్రెస్‌తో పాటు కలిసి రావడానికి ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ సంప్రదింపులు భూమికగా పనికి వచ్చే అవకాశం ఉన్నది.

గతంలోనూ ప్రశాంత్ కిశోర్ స్టాలిన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డి వంటి ఎన్‌డీఏయేతర పార్టీల సీఎంలతో చర్చించడానికి సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలతో సంప్రదింపులు సుమారు 100 లోక్‌సభ సీట్లపై పరోక్షంగానైనా ఒకరకమైన నియంత్రణను పొందవచ్చు. 2024 ఎన్నికల సమయంలో లేదా.. ఆ తర్వాతనైనా.. బీజేపీయేతర లేదా ఎన్డీఏయేతర పార్టీల సమైక్యత కాంగ్రెస్‌కు అవసరం పడవచ్చనే స్ట్రాటజీ కూడా ఉంది.

అంతేకాదు, కాంగ్రెస్‌లోనూ పీకేతో డీల్‌ను అటకెక్కించాలనుకునే నేతలపై అటు పార్టీకి, ఇటు పీకేకు అవగాహన ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పీకేను పార్టీలో చేర్చుకోవడం పార్టీకే ఒక ముప్పు అనేది వారి వాదన. కాగా, ఈ స్థాయి వరకు చర్చలు చేరిన తర్వాత ఆయనను వద్దనడం అదీ.. అర్థం పర్థం లేని ఊహాగానాల కారణంగా డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అనేది కొందరు సీనియర్ నేతల వాదన. అంతేకాదు, మరికొందరు నేతలైతే.. 2024 ఎన్నికల కోసం పీకే ప్లాన్‌ను ఉన్నది ఉన్నట్టుగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కాగా, అసలు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల కోసం ప్లాన్ బీ ఇంకా లేనే లేదని వాదించేవారూ ఉన్నారు. కాబట్టి, ఇప్పుడు బంతి సోనియా గాంధీ కోర్టులో ఉన్నది. ఆమె నుంచి పీకేకు ఆహ్వానం అందితే.. ఈ ఊహాగానాలు అన్నింటికీ ముగింపు పడుతుంది.